పిఠాపురం (తూర్పు గోదావరి): అరుదైన రకాలు పండించాలన్న ఆ రైతు ఆలోచన మొక్కగా మొదలై.. చెట్టుగా మారింది. అది శాఖోపశాఖలుగా విస్తరించి తోటనిండా అద్భుతాలను పండిస్తోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓదూరు నాగేశ్వరరావు అనే రైతు నాలుగు ఎకరాల మామిడి తోటలో ఎన్నో రకాల మామిడి మొక్కలు నాటారు. తోటంతా కాస్తే వచ్చే ఆదాయాన్ని అందులోని ఒకే ఒక మామిడి చెట్టు తెచ్చిపెడుతోంది. ఆ ఒక్క చెట్టుకు 15 కాయలు కాయగా.. వాటి విలువ అక్షరాల రూ.15 లక్షలకు పైగానే ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
కింగ్ ఆఫ్ మేంగో.. ఒక్కో కాయ రూ.లక్ష పైనే
జపాన్ దేశంలో మాత్రమే పండే మియాజాకీ రకం మామిడిని ఓదూరు నాగేశ్వరరావు పండిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా గుర్తింపు పొందింది. ఇది బంగారం ధరతో పోటీ పడుతుంది. జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పండటం వల్ల దీనికి మియాజాకీ అనే పేరొచ్చింది. దీనిని సూర్యుడి గుడ్లు (ఎగ్స్ ఆఫ్ సన్) అని కూడా పిలుస్తారు.
సువాసనలు వెదజల్లుతూ.. లోపల బంగారు ఛాయతో మెరిసిపోయే ఈ మామిడి పండు అత్యధిక పోషకాలను కలిగి ఉంటుందట. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కేజీ రూ.2.70 లక్షల వరకు పలుకుతుందని.. ఒక్కో కాయ ధర కనీసం రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది క్యాన్సర్‌కు మందుగా.. కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధంగా పేరొందడంతో దీనికి విలువ పెరిగింది. నాగేశ్వరరావు తోటలో గత ఏడాది మియాజాకీ రకం పండు మాత్రమే ఒకటి మాత్రమే కాయగా.. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి.
సుమో.. మామిడి!
ఈ రైతు తోటలో ఈ ఏడాది కొత్తగా ఐదు కేజీల మామిడి చెట్లు కాపు మొదలుపెట్టాయి. ఒక్కో మామిడి కాయ బరువు సుమారు ఐదు కేజీలు ఉండటం వీటి ప్రత్యేకం. ప్రస్తుతం ఒక చెట్టుకు రెండు మాత్రమే కాసాయి. ఈ రకాన్ని అఫ్గాన్ దేశానికి చెందిన నూర్జహాన్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కాయగా దీనికి గుర్తింపు ఉంది. ఒక్క కాయ రూ.వెయ్యికి పైనే ఉంటుంది. సుమారు అడుగు పొడవు ఉండడం దీని విశేషం. పూత దశలో ఉండగానే దీనికి డిమాండ్ పెరుగుతుంది. మామిడి ప్రియులు వీటిని ముందుగానే బుక్ చేసుకుంటారు.
విచిత్ర ఆకారాలు.. చిత్రమైన రంగులు
నాగేశ్వరరావు తోటలో అడుగుపెడితే కళ్లు మిరుమిట్లు గొలిపే రంగులు.. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో మామిడి కాయలు కనిపిస్తాయి. చూడటానికి తయారు చేసిన కాయల మాదిరిగా కనిపిస్తాయి. ఇక్కడి మామిడి చెట్లకు అరటి పండ్లు వేలాడుతుంటాయి. వాటిని కోస్తే మాత్రం అచ్చమైన మామిడి పండ్లే. వీటిని అరటి పండ్ల మాదిరిగానే వలుచుకు తినేయొచ్చు. అచ్చం యాపిల్ పండ్ల మాదిరిగా ఉండే మామిడి పండ్లు సైతం ఈ తోటలో కాస్తున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వందకు పైగా అబ్బురపరిచే మామిడి మొక్కలతో ఈ పండ్ల తోట కనువిందు చేస్తోంది.
మియాజాకీ 15 కాయలు కాసింది
నాలుగేళ్ల క్రితం వివిధ రకాల మామిడి మొక్కలు వేయడం ప్రారంభించాను. గత ఏడాది మియాజాకీ మామిడి పండు ఒకటి కాసింది. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. ఈ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో రెండు చెట్లు మాత్రమే కాస్తున్నాయి. ఒక్కో కాయ 380 నుంచి 450 గ్రాముల వరకు బరువు ఉన్నాయి. మొత్తం మామిడి కాయల బరువు సుమారు 6 కేజీల వరకు ఉంటుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.15 లక్షల పైమాటే. – ఓదూరి నాగేశ్వరరావు, రైతు, చేబ్రోలు
ఇవి చాలా అరుదు
మియాజాకీ, నూర్జహాన్ రకాల మామిడి మన ప్రాంతంలో పండటం చాలా అరుదు. ఇవి చాలా విలువైనవి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని రకాలు చాలా అరుదైనవే. వీటిని ఇతర రైతులకు పరిచయం చేయడానికి ప్రయతి్నస్తాం. మొక్కలు నాటినా అవి చాలా వరకు పంటకు రావు. కానీ.. ఆయన అరుదైన రకాలను పండించడం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్‌గానే చెప్పవచ్చు. – అరుణ్‌కుమార్, ఇన్‌చార్జ్ ఉద్యాన శాఖాధికారి, గొల్లప్రోలు
Comments
Please login to add a commentAdd a comment