సాక్షి, తిరుపతి: తిరుమలకు మినీ బ్రహోత్సవంగా పిలువబడే రథసప్తమి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సూర్య జయంతి వేడుకలతో టీటీడీ ఆలయ మాడ వీధుల్లో భక్తసందోహం నెలకొంది. సప్త వాహనాల సేవలో భాగంగా.. తొలుత సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి.
ఇక రథసప్తమి మహోత్సవాలకు తిరుమల సుందరంగా ముస్తాబైంది. ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారి నుదుటన, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారన్నది తెలిసిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలను టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీసుశాఖ చేపట్టింది.
వాహన సేవలు ఇలా..
తెల్లవారుజామున 5.30-8.00 సూర్యప్రభ (సూర్యోదయం 6.40)
ఉదయం 9-10 : చిన్నశేష
ఉదయం 11-12 : గరుడ వాహనం
మధ్యాహ్నం 1-2 : హనుమంత
మధ్యాహ్నం 2-3 : చక్రస్నానం
సాయంత్రం 4-5 : కల్పవృక్ష
సాయంత్రం 6-7 : సర్వభూపాల
రాత్రి 8-9 : చంద్రప్రభ
తిరుమలలో నేడు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. శనివారం వరకు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు.
అలాగే.. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీంతో.. స్థానిక ఆలయాలైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం తదితర ఆలయాల్లో రథసప్తమి పర్వదినం నిర్వహిస్తున్నారు.
మరోవైపు.. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు సూర్యప్రభ వాహనం సేవతో మొదలై.. రాత్రి గజ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆలయ మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్లను ఏర్పాటు చేసింది.
రథ సప్తమి ప్రశస్తి..
మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన సుదినమిది. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్యజయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి, సౌరసప్తమి, భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు. నిజానికి రథసప్తమి నుంచే ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజున స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమినే ఉగాదిగా వ్యవహరించేవారట.
రాష్ట్రంలో పలు ఆలయాల్లో..
రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు, రథయాత్రల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి అర్ధరాత్రి క్షీరాభిషేకం తో ప్రత్యేక పూజలు చేశారు. సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం వేల సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు జిల్లాలోని వజ్రపుకొత్తూరు (మం ) అక్కుపల్లి శివసాగర్ బీచ్ కు భక్తులు పోటెత్తారు.
కృష్ణాజిల్లా మోపిదేవిలో వైభవంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సుబ్రహ్మణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మోపిదేవి పురవీధుల్లో వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు, ఆలయ ఏసీ నల్లం సూర్య చక్రధరరావు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment