వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఖరీదైన వైద్యం
ఐదేళ్లలో 1.46 లక్షల మందికి చికిత్స
రు.572 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: మణికంఠ, యోగేంద్ర తరహాలో అనారోగ్యం బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండానే పూర్తి ఉచితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి జబ్బుల బాధితులతో పాటు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందుతున్నాయి.
న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1.46 లక్షల మందికి మేలు
2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1,46,345 మంది ఉచితంగా చికిత్సలు పొందారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.572.23 కోట్లు వెచ్చించింది. ఇందులో 77,190 మంది న్యూరాలజీ, 69,155 మంది న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్సలు అందుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పథకం బలోపేతంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందుబాటులోకొచ్చాయి. దీంతో న్యూరో, న్యూరో సర్జరీ సమస్యల బాధితులు ఆయా నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్సలు పొందుతున్నారు.
మరోవైపు చికిత్స అనంతరం ఆస్పత్రులకు డిశ్చార్జ్ అయిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద భృతిని సైతం ప్రభుత్వం అందిస్తోంది. దీంతో విశ్రాంత సమయంలో రోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతున్నాయి. జబ్బుల బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలను ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. 2019కు ముందు బాబు పాలనలో నీరుగారిపోయిన పథకాన్ని సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేశారు. రూ.25 లక్షలకు వైద్య సేవల పరిమితిని పెంచడంతో పాటు.. 1059 నుంచి 3257కు ప్రొసీజర్లనూ పెంచారు.
నెట్‌వర్క్ ఆస్పత్రులను విస్తరించారు. దీంతో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 44.78 కోట్ల మంది రూ.13,004 కోట్ల విలువ చేసే వైద్య సేవలు పొందారు. 22 లక్షల మందికి పైగా బాధితులకు చికిత్స అనంతరం రూ.1,300 కోట్లకు పైగా ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందించింది. 3.67 లక్షల మంది గుండె జబ్బు, 3.03 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్న వారిలో ఉన్నారు.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లెకు చెందిన వెంకటరామయ్యది నిరుపేద వ్యవసాయ కుటుంబం. 2021లో రామయ్య దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు యోగేంద్ర ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగిపడిపోయాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే గుంటూరుకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ అరుదైన జబ్బుకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స చేయించింది.
ఈ ఫోటోలో వైద్యుల మధ్య బెడ్‌పై ఉన్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ ఆటోడ్రైవర్. కొంతకాలంగా మూర్చ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆటోను సక్రమంగా నడపలేక జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గతేడాది డిసెంబర్ 29న ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరులోని బ్రింద న్యూరో సెంటర్‌కు తీసుకెళ్లారు.
మెదడులో కుడి వైపు, కుడిచెయ్యి, గొంతు, నాలుక, దంతాలు, దవడ, మాటలు వచ్చే భాగం, ముఖానికి నరాలు సరఫరా చేసే మెదడులోని భాగంలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. దానిని తొలగించ కుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల ఖరీదైన అరుదైన ఆపరేషన్‌ను పూర్తి ఉచితంగా ఆస్పత్రిలో నిర్వహించారు.
అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ల్యాప్‌ట్యాప్‌లో చూపిస్తూ డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి నిర్వహించిన అరుదైన సర్జరీ అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతం మణికంఠ ఆరోగ్యంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment