రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం పూర్తి | Reconstruction of Ramatheertham Temple completed | Sakshi
Sakshi News home page

రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం పూర్తి

Published Mon, Apr 25 2022 3:44 AM | Last Updated on Mon, Apr 25 2022 1:00 PM

Reconstruction of Ramatheertham Temple completed - Sakshi

విగ్రహ ప్రతిష్టకు సిద్ధమైన రామాలయం

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణం కేవలం నాలుగు నెలల్లో పూర్తయింది. ఇక్కడి బోడికొండపై పాత ఆలయం ఉన్నచోటే రూ.3 కోట్ల ఖర్చుతో నూతన హంగులతో కొత్త రాతి దేవాలయం పునర్నిర్మాణానికి 2021 డిసెంబరు 22న శంకుస్థాపన జరగగా.. సోమవారం (ఈనెల 25న) పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వైఖానస ఆగమ పండితులు నిర్ణయించిన ముహుర్తం మేరకు సోమవారం ఉ.7.37 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వార్లను పునఃప్రతిష్టించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

తుపాన్లతో పనులు ఆలస్యం   
2020 డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు కొండపై స్వామి విగ్రహాన్ని తొలగించగా.. అనంతరం అది కొండపైన కోనేరులో బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు పురాతన ఆలయం మొత్తాన్ని కూడా పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సంఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నాటి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి రూ.3 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

జనవరి 3న మంత్రి ప్రకటన చేయగా.. జనవరి 9కల్లా దేవదాయ శాఖ అనుమతులిచ్చింది. అలాగే, 2021 జనవరి 22 నాటికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ సీతారామలక్ష్మణ నూతన విగ్రహాలు రామతీర్థం చేరాయి. 28న కొండ కింద శ్రీరామాలయంలోని ఏర్పాటుచేసిన బాలాలయంలో ఆ విగ్రహాల చర ప్రతిష్ట జరిగింది. ఇక 2021 ఆగస్టు నాటికే పాత ఆలయాల శిథిలాలను తొలగించి కొత్త ఆలయ పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినప్పటికీ, అప్పట్లో రెండుసార్లు తుపాను రావడం.. గ్రానైట్‌ రాళ్ల తరలింపునకు అవరోధాలు ఎదురవడంతో డిసెంబర్‌లో శంకుస్థాపన జరిగింది. ఈలోపు కొండపైకి కొత్తగా త్రీఫేజ్‌ కరెంటు ఏర్పాటుచేశారు. 
విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని కొండ దిగువన ఏర్పాటు చేసిన యాగశాల 

జనరేటర్‌ వెలుగుల్లో పనులు.. 
ఇక పాత ఆలయం స్థానంలో గ్రానైట్‌ రాయితో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి మూడేసి టన్నుల బరువు ఉండే గ్రానైట్‌ రాళ్లను కూడా ఆలయ పునర్నిర్మాణంలో ఉపయోగించారు. 600 మీటర్ల ఎత్తులోని బోడికొండ పైకి గ్రానైట్‌ రాళ్లను తరలించేందుకు 200 మీటర్ల పొడవున ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటుచేయడంతో పాటు 12 టన్నుల బరువుండే రాళ్లను ఎత్తగలిగే భారీ హైడ్రాలిక్‌ క్రెయిన్లను ఉపయోగించారు. మరోవైపు.. త్వరగా ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసేందుకు జనరేటర్ల సాయంతో రాత్రి వేళల్లో పనులు జరిపారు. కుప్పం, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది శిల్పులతో పాటు దేవదాయ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారు.  

మరిన్ని అదనపు వసతులతో.. 
ప్రధాన ఆలయ పనులు ఇప్పటికే పూర్తికాగా, ఆలయం వద్ద మరికొన్ని ఆదనపు వసతులు కల్పించనున్నారు.  
► గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారం (కాంపౌండ్‌ వాల్‌), కొత్తగా యాగశాలనూ నిర్మిస్తున్నారు. వీటిని మరో మూణ్ణెలల్లో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

► మెట్ల మార్గానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేశారు.      గతంలో స్వామివారికి సమర్పించే నివేదనను వండడానికి వసతిలేదు. ఇప్పుడు కొత్తగా నివేదనశాలలను ఏర్పాటుచేస్తారు.

► అలాగే, కొండపైన భక్తుల కోసం ప్రత్యేక షెల్టరును ఏర్పాటుచేయడంతోపాటు భక్తుల కోసం మంచినీటి ట్యాంకు, వాష్‌ రూములు నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  

స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా 
నేను విజయనగరం జిల్లా కలెక్టరుగా ఉన్న సమయంలోనే రామతీర్థం ఆలయంలో ఆ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పుడూ, విగ్రహ ప్రతిష్ట సమయంలో దేవదాయ శాఖ కమిషనర్‌గా నేనే ఉన్నాను. ఆ స్వామివారే మళ్లీ నాకు దేవదాయ శాఖ కమిషనర్‌ పోస్టు ఇప్పించి తొందరగా ఆ పనులన్నీ చేయించుకోమని అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నాను. 
– హరిజవహర్‌లాల్, దేవదాయ శాఖ కమిషనర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement