చేబ్రోలులో పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రంలో పట్టుగూళ్ల ఆన్‌లైన్ కొనుగోళ్లు
పిఠాపురం(తూర్పుగోదావరి): కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో విదేశాలకు సిల్క్ ఎగుమతులు నిలిచిపోయి, స్వదేశీ సిల్క్‌కు గిరాకీ పెరిగింది. ఫలితంగా పట్టుగూళ్ల రేటు ఒక్కసారిగా రెండు రెట్లు పెరిగి, తమ పంట పండిందని రైతులు సంతోషిస్తున్నారు. మరోపక్క మల్బరీ తోటలు, పట్టుగూళ్ల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి కేంద్రంగా ఉన్న గొల్లప్రోలు మండలంలోని పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా రైతులకు మంచి తోడ్పాటు ఇస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా మల్బరీ సాగు గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ 5, పెద్దాపురం డివిజన్ 12, కాకినాడ డివిజన్ 2 మండలాల్లోని 4,500 ఎకరాల్లో 1,100 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు.
చదవండి: సమగ్ర భూ సర్వేకు సర్కారు కసరత్తు
కలిసొచ్చిన ఈ–మార్కెట్
గతంలో జిల్లాలో పండించిన పట్టుగూళ్లను రాష్ట్రంలో పలమనేరు, హిందుపురం, హనుమాన్ జంక్షన్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ–మార్కెట్ ద్వారా కొనుగోళ్లు జరుగుతుండడంతో గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని నోటిఫైడ్ పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి మార్కెట్ అధికారి స్థానికంగా వచ్చిన పట్టుగూళ్ల నాణ్యతను పరిశీలించి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లోనే కావాల్సిన పట్టు కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ రైతులకు తప్పింది. పైగా రవాణా ఖర్చులు మిగిలి, గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో వారు లాభాలు ఆర్జిస్తున్నారు.
భారీగా పెరిగిన ధర
పట్టుగూళ్ల ధరలు గత నెలలో కేజీ రూ.300 వరకూ మాత్రమే ఉండేది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో పట్టుగూళ్ల దిగుబడులు లేకపోవడంతో స్థానిక పట్టుగూళ్లకు గిరాకీ ఏర్పడి ఒక్కసారిగా ధర పెరిగింది. ప్రస్తుతం కిలో పట్టుగూళ్ల ధర రూ.750 నుంచి రూ.900 వరకూ పలుకుతోంది. అది కూడా ఆన్‌లైన్ మార్కెట్ వల్ల రైతులకు శ్రమ తగ్గిపోవడంతో పాటు లాభాలు తెచ్చి పెడుతోంది. చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా ప్రతి రోజూ 2 నుంచి 5 టన్నుల పట్టుగూళ్ల అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో పట్టు సాగు వివరాలు
పట్టు సాగు చేస్తున్న మండలాలు-19
సాగు జరుగుతున్న గ్రామాలు-155
సాగు విస్తీర్ణం 4,500 ఎకరాలు
పట్టు రైతులు 1,150 మంది
పట్టుగూళ్ల దిగుబడి: రోజుకు 5 టన్నులు
మన పట్టుగూళ్లకు ఆన్‌లైన్‌లో మంచి గిరాకీ
చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం ద్వారా విక్రయించే పట్టుగూళ్లకు ఆన్‌లైన్‌లో మంచి గిరాకీ ఉంది. మేము మా కేంద్రానికి వచ్చిన పట్టుగూళ్లను పరిశీలించి నాణ్యత, సిల్క్ శాతం నిర్ధారించి ఆన్‌లైన్‌లో పెడితే కొనుగోలుదారులు కొనుక్కుంటారు. సిల్క్ శాతం ఎక్కువగా ఉండటంతో మన ఏరియా పట్టుగూళ్లకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం దిగుబడి కూడా బాగా పెరిగింది.
– ఇంగువ వాసు, మార్కెట్ అధికారి, చేబ్రోలు నోటిఫైడ్ పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రం
ప్రభుత్వ ప్రోత్సాహం
ప్రభుత్వం ప్రోత్సాహం పెంచడంతో మల్బరీ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మల్బరీ సాగుకు, షెడ్ల నిర్మాణానికి యూనిట్ విలువ రూ.7 లక్షల వరకూ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం దీనిని రూ.10 లక్షలకు పెంచారు. ఇందులో పట్టు పరిశ్రమల శాఖ ద్వారా రూ.3 లక్షలు, రైతు వాటా రూ.లక్ష, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రైతు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రభుత్వం రూ.9 లక్షలు ఇస్తోంది.
– కోనేటి అప్పారావు, చేబ్రోలు పట్టు పరిశ్రమ సాంకేతిక సేవా కేంద్రం అధికారి
ఈ–మార్కెట్‌తో మంచి ఆదాయం
ఆన్‌లైన్ మార్కెట్ వల్ల మాకు శ్రమ తగ్గింది. రవాణా చార్జీలు లేవు. మాకు దగ్గరలోనే కొనుగోళ్లు చేస్తుండడంతో ఖర్చు తగ్గి, లాభాలు పెరిగాయి. గత పదేళ్లలో ఎక్కడా, ఎన్నడూ లేనంతగా రేటు పెరిగింది. దీంతో ఎప్పుడూ రానంత లాభం వచ్చింది. ఆన్‌లైన్ అమ్మకాలతో రైతులకు పట్టుగూళ్ల పెంపకంపై ఆసక్తి పెరిగింది.
– గుండుబిల్లి గణేష్, పట్టు రైతు, చేబ్రోలు
ప్రభుత్వ చేయూత పెరిగింది
గతంలో పట్టుగూళ్ల పెంపకం కత్తి మీద సాములా ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు రైతులకు అండగా నిలిచారు గతంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబులు పట్టు రైతుల బకాయిల విడుదలకు విశేష కృషి చేశారు. ప్రస్తుతం పట్టుగూళ్ల రేట్లు ఆశాజనకంగా ఉండడంతో ఆదాయం మరింత పెరిగింది. గతంలో తక్కువ సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వ చేయూత పెరగడంతో పెట్టుబడి పెద్దగా అవసరం లేకపోతోంది.. దీంతో ఎక్కువ మంది రైతులు మల్బరీ సాగుపై ఉత్సాహం చూపుతున్నారు.
– ఉలవకాయల నాగ లోవరాజు, పట్టు రైతు, జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు
Comments
Please login to add a commentAdd a comment