రక్తదానంలో ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేసేందుకు అంగీకారం తెలియజేసి(టేక్ ది ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్) రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు రక్తదానం చేసేందుకు సిద్ధమంటూ WWW. ysrcpblooddonation.com ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు 1,28,534 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 26,503 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
అలాగే బుధవారం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో 13,039 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు మొత్తం 1,68,076 మందితో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇది వరకు(దక్షిణాఫ్రికా పేర్న) ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వీరేంద్ర.. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు.
24 గంటల్లోనే రికార్డులు బద్దలు
అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చేందుకు ఆసక్తి చూపే దాతల నుంచి అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా నేషనల్ బ్లడ్ సర్వీస్ అనే సంస్థ ఆన్‌లైన్ ద్వారా ఫ్లెడ్జ్ ఫామ్స్ సేకరించింది. అప్పుడు 24 గంటల్లో 71,121 మంది ఫ్లెడ్జ్ ఫామ్స్‌ను అందజేసి సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పటిదాకా మన దేశంలో కేవలం ఎనిమిది గంటల్లో 10,217 మంది ప్లెడ్జ్ ఫామ్స్ ఇచ్చిందే ప్రపంచ రికార్డుగా ఉండేది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో భారీ ఎత్తున రక్తదానం చేశారు. కేవలం 24 గంటల్లోనే 1,68,076 ఈ రికార్డు సృష్టించి.. దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టారని రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.
రక్తదాన ఉద్యమం మరింత ముందుకు..
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ వెంట మనం నడుస్తున్నందునే మనం ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయత, అభిమానం చూపుతున్నారని చెప్పారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం జగన్ దార్శనికుడిగా నిలుస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు(నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ) చల్లా మధుసూదనరెడ్డిని, వారికి సహకరించిన ఐటీ వింగ్ ప్రతినిధులు, సోషల్ మీడియా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలిపారు. రక్తదాన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment