బాధితులకు రూ. 602 కోట్ల పరిహారం పంపిణీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరదలు, భారీ వర్షాల బాధితులకు పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం విడుదల చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్, బీమా, అర్బన్ క్లాప్ యాప్, ఎల్రక్టానిక్ ఉపకరణాల మరమ్మతులపై తొలుత సమీక్షించారు. వరద నష్ట పరిహారం లేఖలను లబ్దిదారులకు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.
తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.602 కోట్ల మేర పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30 కల్లా పరిష్కరించి సాయం అందిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 74 మంది మరణించారని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో నీళ్లు వచ్చిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయమని చెప్పామన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీలు, ఆధార్ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇలా ఏ సర్టిఫికెట్ పోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాడైపోయిన పాఠ్యపుస్తకాల స్థానంలో పిల్లలందరికీ కొత్త పుస్తకాలు ఉచితంగా ఇవ్వమని చెప్పామన్నారు.
ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 4 వేలు డూప్లికేషన్స్ పోగా 13 వేల దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి, అర్హులైన వారికి సాయమందిస్తామని చెప్పారు. సహాయ కార్యక్రమాలను ఈ నెల 30కి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రూ.602 కోట్లలో రూ.400 కోట్లు దాతలిచ్చినవేనని తెలిపారు. విధ్వంసాలు చేయడం, వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతలు కాపాడటం వంటివి తమ బాధ్యత అని, వీటికి ఎవరు విఘాతం కలిగించినా, తప్పులు చేసినా సహించబోమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment