ఏలూరు జిల్లా వేలేరుపాడు పునరావాస కేంద్రంలో వరద బాధితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస
(వేలేరుపాడు నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్‌వీ కృష్ణ కిరణ్): కట్టుబట్టలతో ఉన్న పళంగా అందుబాటులో ఉన్న వస్తువులను మూటలుగా కట్టి నెత్తిన పెట్టుకుని.. చంటి పిల్లల్ని చంక నెత్తుకుని.. ముసలి వారిని వాహనాలపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు లంక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మూగ జీవాలను సైతం రక్షించుకునేందుకు తాపత్రయ పడుతూ.. ఉన్న ఇంటిని, సొంత ఊరిని వదిలి వేలాది మంది ట్రాక్టర్లు, ఆటోలపై సహాయక శిబిరాలకు, బందువుల ఇళ్లకు వెళ్తున్న దృశ్యాలు ఈ ప్రాంతంలో ఊరూరా కనిపిస్తున్నాయి. ‘వరద ముప్పు పెరుగుతోంది.. ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి’ అంటూ వలంటీర్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అనుక్షణం అప్రమత్తం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముందు చూపునకు నిదర్శనం.
చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి..
పోలీస్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించడం, శిబిరాల ఏర్పాటు, బాధితులకు పక్కాగా భోజన ఏర్పాట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. భోజన, వసతి ఏర్పాట్లకు అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది సేవలు ఉపయోగించుకుంటున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా 24 గంటల పాటు వైద్య సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు.
అయినవిల్లి మండలంలో ముంపు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న వరద బాధితులు
ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, టార్పాలిన్, బరకాలు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం బాధితులకు అడుగడుగునా భరోసా కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో విలీన మండలాలైన వేలేరుపాడు, కుకునూరు పరిధిలోని అనేక ముంపు గ్రామాల్లో శుక్రవారం ఈ వసతి సౌకర్యాలు కనిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం.. వలంటీర్ మొదలు కలెక్టర్ వరకు కంటిపై కునుకు లేకుండా సహాయక చర్యల్లో ముమ్మరంగా నిమగ్నమవడం కనిపించింది.
బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ సాయం
♦వేలేరుపాడు మండలంలో 44 గ్రామాలు(ఏడు రెవెన్యూ పంచాయతీలు), కుకునూరు మండలంలో 72 గ్రామాలు(15 రెవెన్యూ పంచాయతీలు) వరద తాకిడికి గురయ్యాయి. ఈ గ్రామాల్లోని వారు చాలా మంది శిబిరాలు, ఎత్తు ప్రాంతంలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. వరద తాకిడికి సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లన్నీ మూగబోయాయి.
♦వేలేరుపాడు మండలంలో ఏర్పాటు చేసిన శివకాశిపురం, కస్తూరిబా బాలికల హైస్కూల్ పునరావాస శిబిరాల్లో 1050 మందికి, కుకునూరు మండలంలో 13 శిబిరాల్లో 2199 కుటుంబాలకు వసతి సౌకర్యం కల్పించారు. శిబిరాల్లో ఉన్న వారికి ఉదయం గుడ్డుతో పాటు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి.. కూర, సాంబారు, పప్పుతో భోజనం అక్కడే వండి వడ్డిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు.
♦బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎం.ఝాన్సీరాణి, జెడ్పీ సీఈవో కేవీఎస్ రవికుమార్ తెలిపారు. బాధితులకు తక్షణావసరాలకు బియ్యం, నూనె, కందిపప్పు, 8 రకాల కాయగూరలు శుక్రవారం అందించారు. కొయిదా, కట్కూరు గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు, టార్పాలిన్‌లు అందించారు.
♦పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించారు. పాము కాటు, గుండెపోటు.. తదితర అత్యవసర మందులు అందుబాటులో ఉంచారు. గర్భిణులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
ప్రభుత్వమే కడుపు నింపుతోంది
మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నేను పనిపై జంగారెడ్డి గూడెం వెళ్లి వచ్చేలోగా మా ఊరిలోకి నీళ్లు వచ్చేశాయి. ఇంటిలో ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఏం చేయగలరు.. అన్నీ వదిలేసుకుని అధికారులు పెట్టిన ట్రాక్టర్లలో వచ్చి శివకాశీపురంలో తల దాచుకుంటున్నాం. మా ఊరిలో మొత్తం పశువులు అన్నీ పోయాయి. ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసరాలతోనే కడుపునింపుకుంటున్నాం.
– మడకం బుచ్చయ్య, రేపాకగొమ్ము
Comments
Please login to add a commentAdd a comment