సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రూ.2,205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతులు మంజూరు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్ల నిర్వహణ నిమిత్తం మొత్తం 1,140 పనులకు గానూ ఇప్పటికే 403 పనులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యాయని, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మొత్తం పనులను పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికితోడు పనులను వేగవంతం చేసేందుకు, కాంట్రాక్టర్లలో ఉత్సాహాన్ని నింపేందుకు బ్యాంకుల నుంచి నేరుగా వారి ఖాతాల్లోకే బిల్లులను జమచేసేలా సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
రాజకీయ లబ్ధికే విపక్షాల నిరసన
వర్షాకాలం తర్వాత ఎటూ రోడ్లన్నీ మరమ్మతులు చేసి బాగుచేస్తారని అందరికీ తెలిసిందే. కానీ.. ప్రతిపక్షాలు ఏదో రకంగా రాజకీయ లబ్ధిపొందడానికి రోడ్ల మరమ్మతుల మీద నిరసనలు చేస్తున్నాయి. మరమ్మతులు చేసిన తర్వాత.. తమ నిరసనలవల్లే ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయి. రోడ్ల నిర్వహణ ఫండ్ నుంచి నిధులిచ్చి దెబ్బతిన్న రోడ్లన్నిటికీ మరమ్మతులు చేస్తాం. గత ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు తగిన నిధులు కేటాయించకపోవడంవల్లే ప్రస్తుత పరిస్థితి నెలకొంది. అలాగే..
– గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.220 కోట్లు కేటాయించినప్పటికీ.. వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతుల కోసం రూ.932 కోట్లతో పనులు చేపట్టాం. ఇందులో రూ.417 కోట్లతో స్టేట్ హైవేస్, రూ.515 కోట్లతో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధి జరిగింది. ఇందుకు సంబంధించి రూ.600 కోట్ల బిల్లులకు గానూ రూ.380 కోట్లు చెల్లించాం. జనవరిలో చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా రెండు మూడు వారాల్లో విడతల వారీగా విడుదలకు చర్యలు తీసుకుంటున్నాం. నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను కూడా కోరాం.
– రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే సెస్‌ను ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మళ్లించి వాటిని రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తాం. రుణాల కోసం ఐదు జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరిపాం. మూడు బ్యాంకుల్లో లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరుకు రుణం మంజూరవుతుందని ఆశిస్తున్నాం.
– 2021–22 బడ్జెట్‌లో రోడ్ల నిర్వహణకు రూ.410 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.160 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత రోడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేందుకు ప్రతి రెండు జిల్లాలకు ఒక చీఫ్ ఇంజినీర్‌ను నోడల్ అధికారిగా నియమించాం.
– ప్రస్తుతం రూ.155 కోట్ల ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ల నిధులతో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి.
– రూ.1,158.53 కోట్ల నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధులతో 99 రాష్ట్ర రహదారులు, 134 మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల విస్తరణ చేపట్టాం. ఇందులో మొదటి విడతగా రూ.408 కోట్లు విడుదల చేయగా రూ.399.68 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాం. మిగిలిన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం.
– ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేజర్ ప్రాజెక్టుగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలను కలుపుతూ రెండు లైన్ల రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రూ.6,400 కోట్ల పనుల్లో భాగంగా ఫేజ్–1 కింద రూ.2,970 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాం. నెలరోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. రెండేళ్లలో అన్ని పనుల పూర్తికి సన్నాహాలు చేస్తున్నాం.
రూ.2,205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు
Published Tue, Jul 27 2021 2:29 AM | Last Updated on Tue, Jul 27 2021 8:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment