సాక్షి, అమరావతి : ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌పై బురద జల్లడమే లక్ష్యంగా కొన్ని ఎల్లో మీడియా పూర్తి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ మండిపడింది. సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఖర్చుచేసింది రూ.88.56 కోట్లు అయితే.. రూ.500 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పడం దారుణమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారని.. కానీ, అంకెలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయని తెలిపింది.
2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించి సంస్థ వివరాలను కాగ్‌కు సమర్పించామని, 2022–23 సంవత్సరం నివేదికలు త్వరలో సమర్పిస్తామని పేర్కొంది. సిబ్బంది నియామకంలో ఎలాంటి రాజకీయ జోక్యంలేదని, కేవలం చేయాల్సిన పనికోసం అవసరమైన వ్యక్తులను వారి అర్హతలను బట్టి వివిధ మీడియా సంస్థలకు చెందిన వారిని నియమించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత డిజిటల్ మీడియా అవసరాలకు అనుగుణంగా అందులో నైపుణ్యం, సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తిని వీసీ అండ్ ఎండీగా ప్రభుత్వం నియమించిందని పేర్కొంది.
సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వీసీ అండ్ ఎండీ జీతం తీసుకోలేదని, కేవలం రాష్ట్రం కోసం పనిచేయాలనే తపనతో పనిచేశారని తెలిపింది. డిజిటల్ కార్పొరేషన్‌కు ఐ–డ్రీమ్ మీడియాతో సంబంధంలేదని, కార్పొరేషన్ ఆ సంస్థకు ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదని సంస్థ స్పష్టంచేసింది. మీడియా సంస్థలు, వెబ్‌సైట్లకు ప్రకటనలను వాటి కార్యక్రమాలు, వాటికి ప్రజల్లో ఉన్న ఆదరణ, వాటి రీచ్‌ను బట్టి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటిస్తోందని తెలిపింది. పదేపదే అబద్ధాలు రాయడం ద్వారా ప్రజలు వాటిని నిజం అనుకునేలా నమ్మించడానికి ప్రయత్నించడం సరికాదని పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా చేయడం కోసమే తమ సంస్థ పనిచేస్తోందని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ స్పష్టంచేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే సంస్థ లక్ష్యమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment