ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్‌ల్లోనూ రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా..
పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment