సాక్షి, గుంటూరు: ముస్లింలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని.. అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. ముస్లిం సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాదు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తామని తెలిపారాయన. సోమవారం తాడేపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
‘‘ఇది మనందరి ప్రభుత్వం అనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే.. దేవుడి దయతో ప్రతి ఇంటికీ, గడపకూ మంచి చేస్తున్నామని, ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంలో తమ సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు వాళ్లు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు.. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను తెలియజేశారు. ఈ అంశాలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం జగన్ అధికారులను అదేశించారు. అలాగే.. విజయవాడలోనూ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేయగా.. అందుకు అవసరమైన భూమి కేటాయించాలని అక్కడికక్కడే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో.. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని నిర్ణయించారాయన. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటు ఉండాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి.. ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచేందుకు సైతం సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే.. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా.. ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలియజేశారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment