సొంతూళ్లకు సొంత వాహనాల్లోనే.. | Reservations not exceeding 60 percent of RTC regular services | Sakshi
Sakshi News home page

సొంతూళ్లకు సొంత వాహనాల్లోనే..

Published Mon, Jan 11 2021 4:07 AM | Last Updated on Mon, Jan 11 2021 4:13 AM

Reservations not exceeding 60 percent of RTC regular services - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లేవారు ఎక్కువగా సొంత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. బస్సులకు డిమాండ్‌ తగ్గిపోయింది. హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో (ఎన్‌హెచ్‌–65) సొంత వాహనాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఈ మార్గంలో నాలుగువేల నుంచి ఐదువేల వ్యక్తిగత వాహనాలు టోల్‌గేట్లను దాటుతుంటాయి. రెండురోజుల నుంచి 12 వేల వరకు వాహనాలు టోల్‌గేట్ల మీదుగా వెళుతున్నాయి. సొంతూళ్లకు సొంత వాహనాలు, క్యాబ్‌లనే ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారనేందుకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో డిమాండ్‌ తక్కువగా ఉండటమే నిదర్శనం. ఆర్టీసీ రెగ్యులర్‌ రిజర్వేషన్లు కూడా 60 శాతం దాటడం లేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే సగం సీట్లు కూడా నిండలేదు.

ఆర్టీసీ రిజర్వేషన్లను ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆరురోజులు పరిశీలిస్తే రెగ్యులర్‌ సర్వీసుల్లో 60 శాతం ఆక్యుపెన్సీ దాటలేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే  48.03 శాతం రిజర్వేషన్లే అయ్యాయి. ఈ దఫా ఆర్టీసీ రిజర్వేషన్లపై ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. పండుగకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణంలోను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీలోని ముఖ్య నగరాలకు, పట్టణాలకు 571 సర్వీసులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులు అన్ని జిల్లాలకు 1,988 వరకు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు కేవలం 115 మంది మాత్రమే కావడం గమనార్హం.

అధికశాతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంతూళ్లలోనే.. 
మామూలుగా సంక్రాంతి పండుగ సీజన్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్‌ రిజర్వేషన్లు చేయించుకుంటారు. వీరి డిమాండ్‌ కారణంగానే రెగ్యులర్, ప్రత్యేక సర్వీసుల్లో నెలముందే రిజర్వేషన్ల ఆక్యుపెన్సీ 30 నుంచి 35 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్‌ రిజర్వేషన్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కువ శాతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో 90 శాతం మంది ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నట్లు ఆర్టీసీ ట్రాఫిక్‌ వింగ్‌ అంచనా వేస్తోంది. రిజర్వేషన్లు బాగా తక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. విద్యాసంస్థలు తెరవకపోవడం, ఆన్‌లైన్‌ క్లాస్‌లు జరగడం వల్లే విద్యార్థులు కూడా సొంత ప్రాంతాలను దాటి రాలేదని, అందువల్లే రిజర్వేషన్లు చేసుకోలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర,, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆశాజనకంగా రిజర్వేషన్లు ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement