
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోరని, త్వరలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేపడతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో ఎలా నడిపించాలనే అంశంపై సీఎం జగన్ ప్రధాని మోదీకి రెండో సారి లేఖ రాశారని వివరించారు. సీఎం జగన్ అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి, ప్రజల ఆకాంక్షను, సెంటిమెంట్‌ను ప్రధానికి వివరిస్తారని వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్నదని, గతంలో జరిగిన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే 20 వేల మంది ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. మొదట్లో స్టీల్ ప్లాంట్ అత్యుత్తమంగా నడిచిందని, చంద్రబాబు హయాం (2014-15) నుంచే నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత గనులు లేకపోవడం ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి మరో కారణమని తెలిపారు. కేంద్రం సొంత గనులు కేటాయిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. రుణభారాన్ని మూలధనంగా మార్చాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపించడం సరికాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment