
సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా కార్య నిర్వాహక రాజధాని సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు తన రాజీనామాను అంగీకరించాలన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన మంత్రి ధర్మాన కొందరు ప్రగతి నిరోధకులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజల అభిలాషను నెరవేర్చడం కన్నా మంత్రి పదవి గొప్పది కాదని, తన రాజీనామాను అనుమతించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిసింది. దీన్ని సున్నితంగా తిరస్కరించిన సీఎం జగన్ వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తాను సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, సర్పంచ్ నుంచి రెవెన్యూ మంత్రి వరకూ వివిధ బాధ్యతలు సమర్ధంగా నిర్వహించినట్లు ధర్మాన ఈ సమావేశంలో పేర్కొన్నారు. దీని వెనుక దివంగత వైఎస్సార్ ఆశీస్సులు, ప్రోత్సాహం మెండుగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక పరిపాలనలో సమూల మార్పులు తెచ్చారని ప్రశంసించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశం వివరాలివీ..
►ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు, సమగ్రాభివృద్ధి, పరిపాలన రాజధానిగా విశాఖను సాధించుకోవడంతో పోలిస్తే ఈ పదవులు, హోదాలు గొప్పవని నేను భావించడం లేదు.
►అనేక అవకతవకలు, ఆశ్రిత పక్షపాతం, ఏకపక్ష ప్రయోజనాలు, కేంద్రీకృతమైన సంపద కోసం సమగ్రాభివృద్ధిని విస్మరిస్తూ గత సర్కారు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసింది. నాడు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కగా నేడు ధనబలం, ఓ వర్గం మీడియా సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతూ కుటిల యత్నాలు చేస్తున్నారు. రూ.లక్షల కోట్లు వెచ్చించి అమరావతిని మరో హైదరాబాద్‌లా తయారు చేయడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం.
►రాజ్యాంగ వ్యవస్థలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని మీరు (సీఎం జగన్) తీసుకున్న నిర్ణయం ద్వారా మూడు ప్రాంతాల ప్రగతికి బాటలు వేయడం కాకుండా చారిత్రక శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించినట్లయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది కొత్త ఆశలు చిగురింపజేసింది. యువత ఆశలు మొగ్గ తొడిగాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిపోతున్న ప్రాంత ప్రజలకు గౌరవంగా బతకొచ్చనే ధైర్యాన్నిచ్చింది. తమ మధ్యే రాష్ట్ర పరిపాలన జరుగుతుందని వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, గృహిణులు ఉత్తేజితులయ్యారు.
►దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా లెక్కలకెక్కిన శ్రీకాకుళం వాసిగా, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా విశాఖలో పాలనా రాజధాని ఒక్కటే ఈ ప్రాంత అభివృద్ధికి తారక మంత్రమని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నా. వికేంద్రీకరణ సూత్రంతో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అంతా మద్దతివ్వాలి. ఈ దిశగా ఆలోచించినప్పుడు ఉత్తరాంధ్ర ఉజ్వల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతోంది. పొట్ట చేత పట్టుకుని పరాయి ప్రాంతాలకు వెళుతున్న వలసలు ఆగిపోతున్న దృశ్యం కళ్ల ముందు కనిపిస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది.
చదవండి: ‘ఎన్ని మందలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌పై పైచేయి సాధించలేరు’
Comments
Please login to add a commentAdd a comment