వైద్య, ఆరోగ్యానికి ‘సూపర్‌’ ట్రీట్‌మెంట్‌ | Revolutionary Changes In Hospitals Of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్యానికి ‘సూపర్‌’ ట్రీట్‌మెంట్‌

Published Fri, Dec 31 2021 4:59 PM | Last Updated on Fri, Dec 31 2021 6:40 PM

Revolutionary Changes In Hospitals Of Andhra Pradesh - Sakshi

కంటికి కనిపించని కరోనా వైరస్‌ 2020లో మిగిల్చిన చేదు అనుభవాలు.. వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ తాలుకు చేదు జ్ఞాపకాలతో రాష్ట్ర ప్రజలు 2021లోకి అడుగుపెట్టారు. కానీ, కోవిడ్‌ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఏప్రిల్, మే నెలల్లో ఊహించని రీతిలో వైరస్‌ రెండో విడతలో ఒక్కసారిగా విజృంభించింది. దీంతో 2021లో కూడా వైరస్‌ భయంతోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. తాజాగా.. ఒమిక్రాన్‌ రూపంలో వైరస్‌ వ్యాప్తి మరోసారి మొదలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 11.94 లక్షల మంది వైరస్‌ బారినడ్డారు. వీరిలో 11.86 లక్షల మంది కోలుకోగా 7,384 మంది మృత్యువాత పడ్డారు. ఊహించని రీతిలో వైరస్‌ విజృంభించినా సమర్థవంతంగా కట్టడి చర్య చేపట్టి జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది.  
– సాక్షి, అమరావతి

వేగంగా టీకా పంపిణీ 
2021 జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విజయవాడ జీజీహెచ్‌లో పారిశుధ్య ఉద్యోగిని పుష్పకుమారి సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో తొలిడోసు టీకా వేసుకుంది. ఆ రోజు నుంచి దశల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు టీకా పంపిణీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇలా సంవత్సరాంతానికి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో తొలిడోసు టీకాను 100 శాతాన్ని అధిగమించగా.. 74.08 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తిచేసింది.   

కరోనా కట్టడికి రూ.3,683 కోట్లు 
ఇక ఈ ఏడాది నవంబర్‌ 24 నాటికి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,683.05 కోట్లు ఖర్చుచేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్, మందులు సరఫరా చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ అనుభవాలతో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన 175 ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. తద్వారా 24,419 పడకలకు ఆక్సిజన్‌ సరఫరా సమకూరుతోంది.   

ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు 
మరోవైపు.. మొత్తం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్‌ ప్రభుత్వం నాడు–నేడు కింద శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కోసం ఆసుపత్రుల్లో వసతుల కల్పన, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.16,255 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇందులో భాగంగా 2021లో 14 మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి ఈ ఏడాది మే 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిజానికి రూ.7,880 కోట్లతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్‌ కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అలాగే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా భారీగా నియామకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు, కొత్తగా పోస్టులను సృష్టించి అక్టోబర్, నవంబర్‌ నెలల్లో 14,818 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్నింటి ప్రక్రియ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ఇది మొత్తం పూర్తికానుంది. 

నీతి ఆయోగ్‌ ప్రశంసలు 
దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న అత్యంత తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. అంతేకాక..  డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసానిస్తోందని పేర్కొంది.   నీతి ఆయోగ్‌ వెల్లడించిన 2019–20 ఆరోగ్య సూచీల్లో దేశంలో రాష్ట్రానికి నాలుగో ర్యాంకు దక్కింది.  మాత, శిశు మరణాల కట్టడిలో ప్రభుత్వం సుస్థిర లక్ష్యాలను సాధించినట్లు  ప్రశంసించింది.  అలాగే, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత, ఆసుపత్రుల్లో వసతుల కల్పన మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది.  

ఇక రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గుడ్‌ గవర్నెన్స్‌ 2020–21 నివేదికలో పేర్కొంది. గతంతో పోలిస్తే పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 6 శాతం పెరిగినట్లు తెలిపింది.  కోవిడ్‌ కట్టడికి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ మెచ్చుకుంది. రోగుల హోమ్‌ ఐసోలేషన్, వారి ఆరోగ్య పరిస్థితి నిత్య పర్యవేక్షణ, ఇతర చర్యలు భేషుగ్గా ఉన్నాయని తన అధ్యయనంలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement