సాక్షి, అమరావతి: కాస్త ఆలస్యంగానైనా పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువున వరద ప్రవాహం వేగం పుంజుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి తెలుగు రాష్ట్రాలకు కృష్ణమ్మ బిరబిరా కదలివస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ బుధవారం రాత్రి 9 గంటలకు దిగువకు వరద జలాలను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.83 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.
నీటి నిల్వ 88 టీఎంసీలకు చేరుకోవడం.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండంతో బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల మహారాష్ట్రలో ముంపు సమస్యను నివారించడానికి ఆల్మట్టిలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 91 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దాంతో నారాయణపూర్ డ్యామ్‌లోనూ విద్యుదుత్పత్తిని 20 వేల క్యూసెక్కులతో ప్రారంభించి.. గంట గంటకూ పెంచుతున్నారు. గురువారం ఆ రెండు డ్యామ్‌ల గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. దాంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగు పరుగున వస్తోంది. రెండ్రోజుల్లో శ్రీశైలానికి చేరుకోనుంది. ఇక ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం మరింత పెరిగింది.
తుంగభద్ర డ్యామ్‌లోకి 1.13 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. ఇక తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మున్నేరు, కట్టలేరు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికి తోడు వాగులు, వంకల నుంచి చేరుతున్న నీటితో పులిచింతలకు దిగువన కృష్ణాలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది.
ప్రకాశం బ్యారేజ్‌లోకి 91,864 క్యూసెక్కులు చేరుతుండగా అధికారులు గేట్లను ఎత్తేసి అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. గురువారం అర్ధరాత్రికి ప్రకాశం బ్యారేజ్‌లోకి 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, ఆగస్టు, సెప్టెంబర్‌లలో బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గత నాలుగేళ్ల తరహాలోనే ఈ ఏడాది కూడా కృష్ణాలో నీటి లభ్యత మెరుగ్గా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment