సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఒక్క ఫొటో తన జీవితాన్నే మార్చేసిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. ఓ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో వల్లే తనకు సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పారు. వెయ్యి అక్షరాలతో చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటోతో చెప్పవచ్చన్నారు. విజయవాడలో శనివారం విజయవాడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఫొటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నివాల్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లిళ్లు, వేడుకలే కాదు.. పేదల ఆకలిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది, వరదల్లో చిక్కుకున్న వారి స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేది, యుద్ధాల్లో భయానక పరిస్థితి ప్రపంచానికి తెలియచేసేది ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లేనని అన్నారు.
ఫొటో కార్నివాల్‌లో మంత్రి రోజా వేదికపై జాతీయ పతాకాన్ని పట్టుకోగా.. ఒకేసారి 3 వేల మందికిపైగా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఏకకాలంలో ఫొటోలు తీశారు. ఇంతమంది ఒకేసారి ఫొటో తీయడం ‘ఇండియాస్ యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’లో నమోదైంది. దీనిని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కూడా పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ మాదల రమేష్, అధ్యక్షుడు మెట్ట నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజ్, కోశాధికారి చిలంకుర్తి శేషు, గెల్లా రాజు, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment