టంగుటూరు: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్‌ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది.
ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. అనంతరం ఆమెను టంగుటూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఐదు నిమిషాలు అక్కడ ఉంచారు. అనంతరం సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై శ్రీరామ్, ఒంగోలు దిశ ఎస్సై ఫిరోజ్ ఫాతిమాల సమక్షంలో ఆమెను అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. ఈ సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమెను ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదు.
గతంలోనూ తనిఖీ
ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్‌ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్‌ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది.
ఆ సమయంలో శిరీష వైద్యం నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో విరసం నేత కళ్యాణరావును తీసుకొచ్చారు. శిరీష లేకుండా తలుపులు తీయడానికి ఆయన నిరాకరించడంతో తహసీల్దార్, వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టారు. శిరీష ఇంటి నుంచి సాధారణ షాపుల్లో దొరికే కొన్ని పుస్తకాలు, పలు సీడీలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది అక్రమ అరెస్టు: కళ్యాణరావు
శిరీషను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొన్నట్లు తెలుసుకున్న విప్లవ రచయితల సంఘం నేత గంగుల కళ్యాణరావు హుటాహుటిన స్టేషన్‌కు వచ్చారు. కళ్యాణరావు, ఇతర బంధువులు ఎస్సై శ్రీరామ్‌తో మాట్లాడారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. శిరీషను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్‌ఐఏ బృందం తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లిందని, ఎక్కడ ఉంచారన్నదీ ఇప్పటివరకు తెలపకపోవడం దారుణమని చెప్పారు. ఎవరినైనా అరెస్టు చేసే ముందు కుటుంబ సభ్యులకు తెలపాలని అన్నారు. శిరీషను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
చేశారు.శిరీషపై పెట్టినవన్నీ బూటకపు కేసులేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment