ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
మృతుల్లో ఇద్దరు మహిళలు, నాలుగేళ్ల బాలుడు
తీవ్ర గాయాలపాలైన మరో బాలుడు, డ్రైవర్
ద్వారకాతిరుమల: కారు డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన రాచాబత్తుని నాగార్జున హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
అతని భార్య భాగ్యశ్రీ (30) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూ నిమిత్తం ఈ నెల ఆరో తేదీన భీమవరానికి చెందిన తన తల్లిదండ్రులు బొమ్మా నారాయణరావు, కమలాదేవి (57)తో పాటు, తన ఇద్దరు పిల్లలు నాగనితిన్ కుమార్ (4), నాగషణ్ముఖను తీసుకుని కిరాయి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంటర్వ్యూ ముగించుకుని ఏడో తేదీ రాత్రి స్వగ్రామానికి అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నారాయణరావు విజయవాడలో కారు దిగి, భీమవరానికి వెళ్లిపోగా, మిగిలినవారు రాజవోలుకు బయలుదేరారు.
అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్ దుర్గా వంశీ నిద్రమత్తులో రోడ్డు పక్కన నిలిపివున్న కంటైనర్‌ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో భాగ్యశ్రీ,, ఆమె తల్లి కమలాదేవి, ఆమె చిన్న కుమారుడు నాగనితిన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పెద్ద కుమారుడు నాగషణ్ముఖ, డ్రైవర్ దీవి వంశీకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి ఘటనాస్థలిని పరిశీలించారు. భీమడోలు సీఐ బి.భీమేశ్వర రవికుమార్, ద్వారకా తిరుమల ఎస్‌ఐ జి.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment