Andhra Pradesh Assembly Session: జన అజెండా | Ruling party gearing up to discuss extensively in AP Assembly | Sakshi
Sakshi News home page

Andhra Pradesh Assembly Session: జన అజెండా

Published Wed, Sep 14 2022 5:14 AM | Last Updated on Wed, Sep 14 2022 5:52 PM

Ruling party gearing up to discuss extensively in AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా శాసనసభలో విస్తృతంగా చర్చించేందుకు అధికార పక్షం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని చట్టసభల వేదికగా తిప్పికొట్టి నిజానిజాలను ప్రజలకు వివరించనుంది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి.

అసెంబ్లీ, మండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. శనివారం, ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది. తిరిగి సోమవారం నుంచి బుధవారం వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. శాసన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీలో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.   

► అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చట్టసభల్లో చర్చించేందుకు అధికార పక్షం సర్వ సన్నద్ధమైంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేరకు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణకు తీసుకున్న చర్యలు, ఇప్పటికే చేపట్టిన పరిపాలన సంస్కరణలపై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది.  

► ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేయడంతోపాటు రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తూ పదేపదే అప్పులపై దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అధికార పక్షం నిర్ణయించింది. అప్పులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులపై కూడా దుష్టచతుష్టయం విషం చిమ్ముతోంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులతో పాటు రానున్న పెట్టుబడుల వివరాలను కూడా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని అధికార పక్షం నిర్ణయించింది. మరో పక్క కోవిడ్‌ సంక్షోభంలోనూ దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం రెండంకెల వృద్ధిని గత ఆర్థిక ఏడాదిలో సాధించింది. మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా అత్యధిక వృద్ధి సాధించడానికి తీసుకున్న చర్యలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు వివరించనుంది. 

► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్య రంగాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ రంగ విద్యా సంస్ధలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన బోధనతో పేద, సామాన్య వర్గాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ వేదికగా అధికార పక్షం వివరించనుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు జవసత్వాలు కల్పించి అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దడంతోపాటు ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టడం, హెల్త్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా చేపట్టిన చర్యలను అసెంబ్లీ ద్వారా తెలియచేయనుంది. 

► మహిళా సాధికారికతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.  మహిళలు, పిల్లల భద్రతకు పలు చర్యలను తీసుకుంది. ఇటీవల నేషనల్‌ క్రైం బ్యూరో నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నేరాలు తగ్గిన విషయాన్ని తెలియజేసింది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి ప్రజలకు తెలియజేయాలని అధికారపక్షం నిర్ణయించింది.  

► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చేకూర్చిన న్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తీరుతో పాటు నేరుగా నగదు బదిలీ ద్వారా పారదర్శకంగా చేకూర్చిన లబ్ధిపై అసెంబీల్లో చర్చించి వివరించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 30 లక్షల మందికిపైగా పేద మహిళలకు వారి పేరిటే ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చించాలని అధికారపక్షం నిర్ణయించింది.  

► పోలవరంపై గత ప్రభుత్వ నిర్వాకాలను చట్టసభల వేదికగా బహిర్గతం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేలా తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీలో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. మద్యం, ఇసుకపై దుష్ట చతుష్టయం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement