తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 87,081 మంది స్వామివారిని దర్శించుకోగా, 41,575 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.4.05 కోట్లు సమర్పించారు.
టైం స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 36 గంటల్లో దర్శనం లభిస్తోంది. క్యూలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు పాలు, ఉప్మా, పులిహోర, సాంబార్ అన్నం అందిస్తోంది. అదేవిధంగా అవసరమైన భక్తులకు అశ్విని ఆస్పత్రి సిబ్బంది మందులు పంపిణీ చేస్తున్నారు.
28న తిరుమల శ్రీవారి ఆలయం మూత
ఈ నెల 28వ తేదీ రాత్రి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంటుందని, కాబట్టి 28వ తేదీ రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు వెల్లడించింది.
గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. తిరిగి 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటలపాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. అందువల్ల ఈ నెల 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధుల దర్శనాలను రద్దు చేశారు.
నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు
పెరటాసి నెల రద్దీ కారణంగా సోమవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment