
సాక్షి, తాడేపల్లి: అట్టడుగులో ఉన్న బీసీ కులాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీల సమస్యలను రాజకీయంగా వాడుకుంటూ వారికి సమాజంలో కనీస గుర్తింపు లేకుండా చేసిన వైనాన్ని సీఎం జగన్ తన పాదయాత్రలో చూశారని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీసీల అభ్యున్నతి కోసం కసరత్తు మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఈక్రమంలోనే బీసీలలో చాలామందికి తెలియని కులాలను కూడా వెతికి ఆ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేశారని వివరించారు. ఆ కార్పొరేషన్లతో ప్రతి బీసీ కులాన్ని చైతన్యవంతంగా మార్చడం సీఎం ఆశయమని వెల్లడించారు.
చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్‌బుక్
తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పద్మశాలి కార్పొరేషన్ సమావేశంలో సజ్జల మాట్లాడారు. దేశానికి కళాత్మకమైన చేతి వృత్తి చేనేత అని, ప్రపంచంలోనే చేనేత వస్త్రాలకు గొప్ప ఆదరణ ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న ఆఖరి వ్యక్తికి అందేలా చూడటం మన లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు.
చదవండి: సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు.. మోహన్‌బాబు
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో సీఎం జగన్ బీసీలను భారతీయ సంస్కృతిగా అభివర్ణించారని గుర్తుచేశారు. బీసీలను సమాజానికి వెన్నెముకలా మార్చాలని సీఎం ఆశయమని తెలిపారు. నేతన్న నేస్తం ద్వారా కరోనా కష్టకాలంలో చేనేత కుటుంబాలకు సీఎం జగన్ భరోసా కల్పించారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్ మోహన్ రావు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment