
సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు చేయూతనందించి.. వారిని తీర్చిదిద్దితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సాంఘిక సంక్షేమ పథకాల అమలు’పై గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలు, తదితర అట్టడుగు వర్గాలు తమకు కావాల్సినవాటిని హక్కుగా అడిగేలా.. అవసరమైతే ప్రశ్నించేలా వారిని తీర్చిదిద్దినప్పుడే మెరుగైన సమాజం సాధ్యమన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా సాధించుకోలేని స్థితిలో తరతరాలుగా అట్టడుగు వర్గాలు అలక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అటువంటి వారికి సంక్షేమ ఫలాలు అందించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ మహాయజ్ఞాన్ని సీఎం జగన్ మరింత వేగంగా చేపట్టారని చెప్పారు. వైఎస్ ఆశయాలు, సీఎం వైఎస్ జగన్ ఆలోచనలను అమలు చేయడం ద్వారా ఎస్సీలు అభివృద్ధి పథంలో నడిచేలా మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరైనా చనిపోతే ఆ ఖాళీలోనే కొత్త పెన్షన్ ఇచ్చేవారని సజ్జల గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోటా, వాటా అనే మాటలకు తావులేకుండా.. పరిమితి, కాలపరిమితి చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వానికి నిధుల అడ్డంకి లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎస్సీ కుటుంబం సగర్వంగా తలెత్తుకుని జీవించేలా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల స్థితిగతులను మార్చేందుకు సీఎం చేపడుతున్న కార్యక్రమాలను దేశంలో మరే రాష్ట్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ సదస్సులో ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment