డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి, పార్టీ నేతలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ జీవితంలో యదార్థ ఘటనలను సేకరించి వరప్రసాద్ ప్రచురించిన పుస్తకాన్ని సజ్జల రామకష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమసమాజం గమ్యంగా జాతిని నడిపించడానికి అంబేడ్కర్ కృషిచేశారని కొనియాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. అంబేడ్కర్ ఆలోచన విధానం, ఆయన దార్శనికత స్ఫూర్తిగా పనిచేస్తోందన్నారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జగన్ వాటిని అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత, రాజకీయంగా దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, కులమతాలకు అతీతంగా పేదల అభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ ఎస్సీలను బంధువులుగా భావించి, వారి సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారని తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీని చేశారన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలే ఊపిరిగా అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, ఇతర పార్టీలకు దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని చెప్పారు. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment