![Sajjala Ramakrishna Reddy Says YSR Jagananna Colonies Grounding Drive Success - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/4/Sajjala-Ramakrishna-Reddy.jpg.webp?itok=_qdM7dhg)
సాక్షి, గుంటూరు: ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల్లో జరిగిన శంకుస్థాపనలు ఒక రికార్డ్ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గృహ శంకుస్థాపనల్లో లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రికి మించిన తనయుడు అని సీఎం వైఎస్ జగన్ నిరూపించుకున్నారని కొనియాడారు. ఆనాడు వైఎస్‌ఆర్ తలపెట్టిన గృహనిర్మాణం అసాధ్యం అనుకున్నామని, దివంగత మహానేత వైఎస్‌ఆర్ ఇళ్ల నిర్మాణాన్ని సుసాధ్యం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేశారని తెలిపారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, నివాస యోగ్యం లేని ఇళ్లను నిర్మించి బాబు చేతులు దులుపుకున్నారని సజ్జల దుయ్యబట్టారు.
అయితే సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు 25 వేల ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ కొని పేదలకు ఇళ్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశామని, నేడు ప్రతి లబ్ధిదారుడి కళ్లలో నిజమైన ఆనందం కనబడుతోందని తెలిపారు.
ఇళ్ల స్థలాలపై కొన్ని పత్రికలు వక్రీకరించి వార్తలు రాస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. విషం కక్కుతూ సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విష పత్రికలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగనన్న కాలనీల వల్ల చాలామందికి పరోక్ష ఉపాధి దొరకుతోందని,15 లక్షల ఇళ్ల నిర్మాణం వల్ల లక్షలాదిమందికి పని సృష్టించబడుతుందని గుర్తుచేశారు. కరోనా సమయంలో దాదాపు 16 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందని సజ్జల వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment