సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 70 అంశాలపై కార్యదర్శుల సమావేశంలో చర్చించామని, త్వరలోనే వీలైనన్ని పరిష్కరిస్తామని చెప్పారు. పీఆర్సీ, ఫిట్‌మెంట్, పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశాలను మరోసారి పరిశీలించి మళ్లీ సంఘాలను పిలుస్తామన్నారు.
ఆర్థికేతర అంశాలను పరిష్కరించాలి
ఆర్థికేతర అంశాలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కార్యదర్శుల కమిటీ నివేదికను పక్కనపెట్టి 11వ పీఆర్సీ నివేదికను అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్.. ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారుల లెక్కలు తప్పని చెప్పాం
కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ 14.28 శాతం అని అధికారులు వేసిన లెక్కలు తప్పని చెప్పాం. లెక్కలతో సహా తప్పుడు అంచనాలు వేశారని తెలియచేశాం. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. 34 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని అడిగాం.
– వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు
మార్చి లోపు పరిష్కరిస్తామన్నారు
ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను మార్చి లోపు పరిష్కరిస్తామన్నారు. రూ.1,600 కోట్ల ఉద్యోగుల నిధులకు సంబంధించి బెనిఫిట్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. పీఆర్సీపై అన్ని సంఘాలు ఒకే మాటపై ఉన్నాయి. ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి వద్దే తేల్చాలని కోరాం.
– బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్
పీఆర్సీ అంశానికి ముగింపు పలకాలి
ఉద్యోగుల పీఆర్సీ అంశానికి వెంటనే ముగింపు పలకాలని కోరాం. పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం క్లారిటీతోనే ఉంది.
– సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
సుదీర్ఘంగా చర్చించాం..
రెండు గంటల పాటు దాదాపు 70 డిమాండ్లపై చర్చించాం. రూ.వెయ్యి కోట్ల జీపీఎఫ్, రూ.300 కోట్ల ఏపీజీఎల్‌ఐ కొంత విడుదల చేయాలని కోరాం. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.21 కోట్లు, నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.42 కోట్లు ఇస్తామన్నారు.
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
ప్రభుత్వం.. మీ వెంటే: సమీర్‌శర్మ
Published Thu, Dec 23 2021 3:40 AM | Last Updated on Thu, Dec 23 2021 9:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment