సాక్షి, అమరావతి: ఇసుక రవాణాను మరింత సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక డోర్ డెలివరీకి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు ఈ బుకింగ్ బాధ్యతను అప్పగించారు. వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు కడితే అక్కడి నుంచే చలానా వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నాయి.
ఆంధ్రా శ్యాండ్ పేరుతో వెబ్ పోర్టల్ www. andhrasand.com మొబైల్ యాప్ andhrasand app ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆఫ్‌లైన్ విధానంలో రవాణా చేసే వ్యక్తులు మధ్యవర్తులుగా మారి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తుండడంతో ఆన్‌లైన్ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు (ఆదివారం, సెలవులు మినహా) మ.12 గంటల నుండి సా.6 గంటల వరకు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్, డిపో నుండి 20 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ఉన్న బుకింగ్‌కు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడి ఇసుకనైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు.
బుకింగ్ ఇలా..
► సాధారణ వినియోగదారుడు మొబైల్ నెంబర్‌తో, బల్క్ వినియోగదారుడు మొబైల్, ఈ–మెయిల్, పాన్, జీఎస్‌టీ నెంబర్‌తో ఇసుకను బుక్ చేసుకోవాల్సి వుంటుంది.
► డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించే ఏర్పాటుచేశారు.
► డిపోలో ఇసుక లోడ్ చేసిన తర్వాత వినియోగదారునికి జీపీఎస్ నావిగేషన్ ప్రారంభమవుతుంది. బుక్ చేసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు రవాణా చేసే వాహనాన్ని ట్రాక్ చేస్తారు. వెబ్ పోర్టల్, యాప్, కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ద్వారా కూడా వినియోగదారులు బుకింగ్ ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
► ఏమైనా ఇబ్బందులు వస్తే కస్టమర్ కేర్ కాల్ సెంటర్ 9700009944కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
బుక్ చేసుకున్న రోజే డెలివరీ
ప్రస్తుతం 147 డిపోలు, 215 రీచ్‌లలో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరుగుతాయి. పీక్ స్టేజ్‌లో ఇది కోటిన్నర క్యూబిక్ మీటర్లు ఉంటుంది. గతంలో బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇసుక వచ్చేది. కానీ, ఇప్పుడు బుక్ చేసుకున్న రోజే డెలివరీ చేస్తున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లను ఇప్పటికే ప్రకటించారు. రీచ్‌లు, డిపోల వద్ద ధరల పట్టిక, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. మధ్యవర్తులు ఎక్కువ రేటుకి అమ్మకుండా ఈ చర్యలు చేపట్టారు.
బ్లాక్ మార్కెటింగ్‌ను సహించం
వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరసమైన రేటుకు, నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండూ విధానాలు పెట్టాం. మధ్యవర్తులు ఎక్కువ రేటుకు అమ్మకుండా చూసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సహించం. ఫలానా రీచ్‌లోనే బుక్ చేసుకోవాలనేది లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షల్లేవు. వినియోగారులకు ఇంకా సులభంగా ఇసుకను అందించేందుకు ప్రయత్నిస్తాం.
– వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment