తవ్వుకో తమ్ముడూ! | Sand mining with heavy machinery | Sakshi
Sakshi News home page

తవ్వుకో తమ్ముడూ!

Published Sat, Aug 3 2024 5:36 AM | Last Updated on Sat, Aug 3 2024 6:52 AM

Sand mining with heavy machinery

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లు, యార్డులను చెరబట్టిన టీడీపీ నేతలు

స్టాక్‌ యార్డులు దోచేశారు.. ఇప్పుడు రీచ్‌లపై పడ్డారు

అధికారంలోకి వచ్చిన వెంటనే నిల్వ ఉన్న 40 లక్షల టన్నుల ఇసుకను తమ్ముళ్లు బొక్కేశారు  

ఇసుక పాలసీ రాలేదు.. అయినా రీచ్‌లు తవ్వేస్తున్నారు..

తిరుపతి స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు 

బాపట్ల జిల్లా పెసర్లంక, గాజుల్లంక రీచ్‌లలోనూ అదే తంతు  

నెల్లూరు, ఎన్టీఆర్‌ జిల్లాల నుంచి హైదరాబాద్‌ తరలుతున్న ఇసుక 

అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఇసుక దందా 

అయినా కన్నెత్తి చూడని అధికారులు

ఇసుక ఉచితంగా ఇస్తే కార్మికులకు పని దొరుకుతుంది... ఆదాయం  వస్తుంది... రాష్ట్ర సంపద పెరుగుతుంది... దానితో అభివృద్ధి చేస్తా... పూర్‌ టూ రిచ్‌ నా విజన్‌... అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. కానీ, అధికారంలోకి వచ్చాక తమ్ముళ్లను రిచ్‌గా మార్చడంపై ఆయన దృష్టిపెట్టారు. ఇసుకను వారికి వరంగా మార్చారు. ఇసుకపాలసీ తేకుండానే వచ్చిరాగానే స్టాక్‌ యార్డుల్లో 40 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు బొక్కేశారు. 

మిగిలిన 40 లక్షల టన్నులను ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. ఇపుడు ఏకంగా రీచ్‌లపై పడ్డారు. జేసీబీలు పెట్టిమరీ పట్టపగలే అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ నచ్చిన ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమ్ముళ్లు రిచ్‌ కావడానికిలా బాబుగారు ఇసుక రీచ్‌లను అప్పనంగా అప్పగించేశారు. రాష్ట్రంలోని పలు రీచ్‌లు, స్టాక్‌యార్డులను సాక్షి పరిశీలించింది.

వానాకాలం కావడంతో ఇసుక రీచ్‌లు ఇంకా అధికారికంగా తెరవలేదు. అయినా తమ్ముళ్లకు అడ్డేలేదు. అడిగేవాడు లేడు.. దోచుకున్నవారికి దోచుకున్నంత.. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే ఇసుక వాహనాలు దూసుకెళ్తున్నాయి.. భారీ యంత్రాలు పెట్టిమరీ ఇసుకను తోడేస్తున్నారు. అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 

వానాకాలం ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ముందు చూపుతో ఏర్పాటుచేసిన స్టాక్‌ యార్డుల్లో ఇసుకనూ కాజేశారు. ఇప్పటికే సగానికి సగం తినేశారు. మిగిలిన సగం ఇష్టమొచ్చిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. ఇసుక కావాలంటే తమ్ముళ్ల జేబులు తడవాల్సిందే. మంచిధర పలకాల్సిందే. రీచ్‌ల్లోనూ, స్టాక్‌ యార్డుల్లోనూ తమ్ముళ్ల  దోపిడీ ఎలా ఉందో సాక్షి పరిశీలించింది.     – సాక్షి, అమరావతి


ఉచితం పేరుతో టీడీపీ నేతలు ఇసుకను ఊడ్చేస్తున్నారు. ఇటు స్టాక్‌ యార్డులను ఖాళీ చేస్తున్నారు. అటు రీచ్‌లను గుల్ల చేస్తున్నారు. స్టాక్‌ యార్డుల్లో ఒక రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. రీచ్‌లలో మరో రకమైన దందా సాగిస్తున్నారు. స్టాక్‌ యార్డుల్లో అంతా సవ్యంగా సాగుతున్నట్లు బోర్డులు పెట్టినా... టీడీపీ నాయకులు అధికంగా డబ్బులు వసూలు చేసుకుని టోకెన్లు ఇచ్చినవారికే ఇసుక లోడ్‌ చేస్తున్నారు. అదేవిధంగా అధికారికంగా మూతపడిన రీచ్‌లలోనూ అడ్డూ అదుపు లేకుండా భారీ యంత్రాలు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. 

అక్రమంగా తవ్విన ఇసుకను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నారు. బయట ప్రాంతాలకు ఇసుకను తరలిస్తుండటంతో స్థానికంగా ప్రజల అవసరాలకు సరిపడా దొరకడం లేదు. అధికార పార్టీ నేతలకు అనధికారికంగా అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎక్కడా విక్రయించడం లేదు. మరోవైపు కొందరు టీడీపీ నాయకులు స్టాక్‌ యార్డుల్లో ఒక టోకెన్‌ చూపించి 10, 15 లారీల ఇసుక లోడ్‌ చేయించుకుని తీసుకువెళుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేడు.    
 
‘స్టాక్‌’ స్వాహా చేసి రీచ్‌లపై పడ్డారు..
గత ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్టాక్‌ యార్డుల్లో ముందుగానే 80లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకపై టీడీపీ నేతలు కన్నేశారు. ప్రభుత్వం ఉచిత పాలసీ విధివిధానాలు ఖరారు చేసేలోపే 40లక్షల టన్నులను స్వాహా చేశారు. మిగిలిన 40లక్షల టన్నులను ఉచితంగా పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. 

కానీ, ఆచరణలో ఎక్కడా ఉచితంగా ఇసుక ఇస్తున్న దాఖలాలు లేవు. స్టాక్‌ యార్డులను కేంద్రంగా చేసుకుని టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారు.   ఇప్పుడు ఏకంగా రీచ్‌లపై పడి దొరికినంత తవ్వేస్తున్నారు. కొత్త సర్కారు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇసుక పాలసీ రాలేదు. అయినా తమ్ముళ్లకు లెక్కేలేదు. వారిని ఆపేవారే లేరు. ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే. అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.

» రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను చెరబట్టిన టీడీపీ నేతలు 
»  ఇప్పటికే స్టాక్‌ యార్డుల్లో అడ్డగోలు దోపిడీ  
»   వర్షాకాలంలో రీచ్‌లు మూతపడినా భారీ యంత్రాలతో తవ్వకాలు  
»  హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు ఇదే తంతు

కృష్ణాలో పట్టపగలే తవ్వకాలు  
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపాన కృష్ణా నదిలో పట్టపగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న గాజుల్లంక, పోతార్లంక ఇసుక రీచ్‌లు అధికారికంగా మూతపడ్డాయి. కానీ, నదీ తీర గ్రామాలైన పెసర్లంక, గాజుల్లంక, జువ్వలపాలెం, ఈపూరు, చిలుమూరు గ్రామాలలో టీడీపీ, జనసేన నాయకులు ఇష్టానుసారం ఇసుకను తవ్వి వందలాది ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. ప్రతిరోజూ 200లకు పైగా ట్రాక్టర్లను మూడు, నాలుగు ట్రిప్పులు తిప్పుతూ వేల టన్నుల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
 
రెండు నెలల్లోనే రూ.330 కోట్ల నష్టం 
ఉచిత ఇసుక విధానమే అయినా... ప్రజలకు  ఉచితంగా ఇసుక అందకపోగా అదనపు భారం పడుతోంది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా రావడంలేదు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకపై ఏడాదికి రూ.785 కోట్ల ఆదాయం లభించేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆ ఆదాయం రాదు. పైగా ప్రజలకు లాభం కలగడంలేదు. ఈ రెండు నెలల్లో అస్పష్టమైన ఇసుక విధానం వల్ల ప్రభుత్వం రూ.130 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 

మరోవైపు స్టాక్‌ యార్డుల నుంచి టీడీపీ అక్రమంగా కొల్లగొట్టిన 40 లక్షల టన్నుల ఇసుక విలువ రూ.200 కోట్లకుపైమాటే. ప్రభుత్వానికి అదీ నష్టమే. డబ్బులు కట్టే ఉచిత ఇసుక విధానం, నిల్వ చేసిన ఇసుకను అక్రమంగా టీడీపీ నేతలు అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వానికి ఈ రెండు నెలల్లోనే అధికారికంగా రూ.330 కోట్ల నష్టం వచ్చినట్లు లెక్క. ఆ డబ్బంతా ఎవరికి జేబుల్లోకి వెళ్లినట్లు? టీడీపీ నేతల జేబుల్లోకే కదా?.. సంపద ఎవరికి పెరుగుతుందో అందరూ ఆలోచించాలి.   

వంశధార.. జనసేన ఎమ్మెల్యే బంధువుల వశం  
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బంధువులు వంశధార నదిని తమ వశం చేసుకున్నారు. భామిని మండలం నేరడి–బిల్లుమడ గ్రామాల మధ్య వంశధార నది నుంచి వారు పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. వంశధార నదీ తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై తనిఖీలు చేస్తున్న గనుల శాఖాధికారులు అటువైపు మాత్రం కన్నెత్తి చూడడంలేదు. 

కాజ్‌వే  దిమ్మెలను  ధ్వంసం  చేసి ఇసుక తరలింపు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముత్తుకూరు, ఆనగల్లు, బీఎన్‌ఆర్‌ పేట రీచ్‌లలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటకకు ఇసుకను తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో సువర్ణముఖి నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. 

భారీ యంత్రాలతో ఇసుక తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం నదిపై కాజ్‌వే మీద ఉన్న దిమ్మెలను సైతం ధ్వంసం చేసి లారీలు వెళ్లేందుకు రోడ్డులా ఏర్పాటు చేసుకున్నారు. దిగువమాసాపల్లె, పాలూరు స్టాక్‌ యార్డులను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడ ఒక టోకెన్‌ తీసుకుని పది ట్రక్కుల్లో ఇసుకను లోడ్‌ చేయించుకుని అక్రమంగా తరలిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై జనం ఆగ్రహం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నానదిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, రవాణా సాగుతున్నాయి. ఈ క్రమంలో పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గురువారం రాత్రి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 50 ట్రాక్టర్లను నిలిపివేసి గొడవ చేయడంతో అందులో ఉన్నవారు వాటిని వదిలేసి పరారయ్యారు. ఇక్కడ ఇసుక తోడితే పర్యావరణానికి ముప్పు ఏర్పడి మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీ ఉనికికే ప్రమాదమని స్థానికులు ఆందోళనకు దిగి అక్రమార్కులను తరిమేశారు. 

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అండతోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు, పల్లిపాడు, మినగల్లు స్టాక్‌ యార్డుల నుంచి టీడీపీ నేతలు తమ ఇష్ట్రపకారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. 20 టన్నుల ఇసుకకు డబ్బులు చెల్లించి 40 టన్నులు లోడ్‌ చేయిస్తున్నారు. వారి ఆగడాలతో దూర ప్రాంతాల నుంచి స్టాక్‌ యార్డులకు ఇసుక కోసం వెళ్లిన లారీలు ఒకటి, రెండు రోజులు పడిగాపులు పడాల్సివస్తోంది.  

రాజాంలో మామిడి తోటల్లో డంప్‌  
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం తునివాడలో నాగావళి నదిలోని ఇసుకను టీడీపీ నేతలు ఎడ్లబండ్ల ద్వారా తరలించి  సమీపంలోని మామిడితోటల్లో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి  విజయనగరం, విశాఖపటా్ననికి చెందిన వ్యక్తులకు ఇసుకను విక్రయిస్తున్నారు. ఎడ్లబండ్ల ద్వారా మాత్రమే ఇసుక బయటకు తీసుకువస్తుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని, ఉచితం మాటున ఇక్కడ రోజూ లక్షల రూపాయల ఇసుక వ్యాపారం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. 

పోలీసులతో చేతులు కలిపి... 
శ్రీకాకుళం రూరల్‌ కరజాడ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నదిలో తవ్విన ఇసుక సమీపంలోని ప్రాంతాల్లో పెట్టి కుప్పలుగో పోసి అక్కడి అమ్ముతున్నారు. నరసన్నపేట మండలంలో లకలాం, మడపాం, గోపాలపెంటలో రాత్రి సమయంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు నేరుగా పోలీసులతోనే చేతులు కలిపి ఇసుక తవ్వకాలు, రవాణాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.  

టీడీపీ నేతల స్లిప్‌లు ఉంటేనే..
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇసుక స్టాక్‌ పాయింట్లు టీడీపీ నేతల దోపిడీకు అడ్డాగా మారాయి. స్టాక్‌ పాయింట్ల వద్ద వారు బహిరంగంగా దందాలు చేస్తున్నారు. రావులపాలెం–1, రావులపాలెం–2, మందపల్లి స్టాక్‌ పాయింట్ల వద్ద ఐదు యూనిట్ల ఇసుక ధర రూ.5,300 ఉండగా, రూ.11,500 చెల్లిస్తే కాని ఇసుక లోడ్‌ చేయడంలేదు. స్టాక్‌ పాయింట్‌ వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటె రూ.5 వేలు అదనంగా అనధికారికంగా చెల్లిస్తేనే ఇసుక ఇస్తున్నారు. 

రావులపాలెం, మందపల్లి, తాడిపూడి, కపిలేశ్వరపురం ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద టీడీపీ నేతలు రోడ్డు మీదనే లారీలు ఆపి ఇసుక స్లిప్‌లు ఇస్తున్నారు. రావులపాలెం వద్ద అయితే టీడీపీ నేతలు ముందుగానే డబ్బులు తీసుకుని రూ.6,200, స్లిప్‌లు ఇస్తున్నారు. ఈ స్లిప్‌లు పొందిన వారిని మాత్రమే స్టాక్‌ పాయింట్‌కు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఈ స్టాక్‌ పాయింట్‌ వద్ద తనిఖీ చేసినా బయటపడని విధంగా దందా అంతా బయటే నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. 

అనంతలో అంతే లేదు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడంలేదు. నందలపాడు సమీపంలో పెన్నా నది పరీవాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుకను తవ్వి బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం ఇసుక లోడుతో లారీలు వెళుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని సంతేబిదనూర్, చిలమత్తూరు మండలంలో పెన్నా, కుముద్వతి, చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వి అమ్ముకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement