మాట్లాడుతున్న సత్యనారాయణ కుటుంబం (ఇన్‌సెట్‌లో) సత్యనారాయణ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన పైడేటి సత్యనారాయణ (73)ది సారా మరణం అంటూ తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడాన్ని అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. తమ తండ్రి మరణం కన్నా సారా తాగి చనిపోయారన్న ప్రచారం తమను ఎక్కువ బాధిస్తోందని, బయటకు రావాలన్నా ఇబ్బందిగా ఉందని, దయచేసి దుష్ప్రచారం ఆపి తమను వదిలేయాలని వారు వేడుకున్నారు. మృతుడు సత్యనారాయణ కుమారుడు మహేశ్వర శ్రీనివాస్, కుమార్తె నాగమణి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రికి కాఫీ అలవాటు కూడా లేదని, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కరోజు కూడా ఆయన మద్యం సేవించలేదని చెప్పారు.
అలాంటి తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరించి, తమను మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తమ తండ్రికి బీపీతో పాటు ఆయాసం ఉందని చెప్పారు. ఈ నెల ఆరో తేదీ తెల్లవారుజామున ఆయాసం ఎక్కువగా రావడంతో బుట్టాయగూడెం క్లస్టర్ ఆస్పత్రికి తీసుకువెళ్లామని, అక్కడ సెలైన్లు పెట్టిన రెండు గంటల తర్వాత తిరిగి ఇంటికి తీసుకువచ్చామని వివరించారు. మధ్యాహ్న సమయంలో తీవ్రమైన దగ్గు, ఆయాసం వచ్చి మృతిచెందారని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో దహన సంస్కారాల అనంతరం ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి తమ తండ్రి సారా తాగి మరణించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారాన్ని దయచేసి ఇకనుంచైనా ఆపేయాలని, తమను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
అసలేం జరిగిందంటే...
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన పైడేటి సత్యనారాయణ 40 ఏళ్లుగా కిళ్లీ షాపు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరో తేదీన హైబీపీ రావడం, ఆస్తమా ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లోనే మృతి చెందారు.
మధ్యాహ్నం దాటిన తరువాత మృతి చెందడంతో బుట్టాయగూడెంలో అంత్యక్రియలు నిర్వహించడానికి వసతులు లేక మానవత అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనంలో జంగారెడ్డిగూడెం శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. దీంతో ఇది సారా మరణమంటూ విష ప్రచారానికి తెర తీశారు. ఎక్కడెక్కడినుంచో ఎవరో ఫోన్లు చేసి మీ తండ్రి సారా తాగి చనిపోయారు కదా ఇబ్బంది పడవద్దు మేము చూసుకుంటామని మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో మానసికంగా వ్యధ చెందిన ఆ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ ఇలాంటి శవరాజకీయాలు చేస్తోందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment