మన మహిళ ఆదాయంలో టాప్
ఏపీ పొదుపు సంఘాల సభ్యుల సగటు వార్షిక ఆదాయం రూ.2.80 లక్షలు
2019 తరువాత సభ్యుల రోజువారీ ఆదాయంలో భారీ పెరుగుదల.. రూ.100 నుంచి రూ.373కి పెరిగిన రోజువారీ ప్రాథమిక ఆదాయం
దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన 20 పొదుపు జిల్లాల్లో 9 ఏపీలోనే..
డిజిటల్ లావాదేవీల్లో ముందు వరుసలో నిలిచిన మన మహిళలు
2027 నాటికి లక్షాధికారులుగా అన్ని రాష్ట్రాల పొదుపు మహిళలు
పొదుపు సంఘాల క్రెడిట్ ఆదాయాలపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
అక్క చెల్లెమ్మలను ఆదుకున్న ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలు
సంఘాలు పునరుజ్జీవం.. సకాలంలో చెల్లింపులతో పెరిగిన రుణ పరపతి
ఇప్పుడు 0.17 శాతానికి తగ్గిపోయిన ఎన్‌పీఏలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా పొదుపు సంఘాలు ఆదాయపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలోని సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం అత్యధికంగా ఉందని, 2019 నుంచి 2024 నాటికి వారి రోజువారీ ఆదాయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. పొదుపు సంఘాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యధిక సగటు ఆదాయం కలిగిన 20 జిల్లాల్లో 15 గ్రామీణ జిల్లాలే కాగా ఇందులో తొమ్మిది జిల్లాలు ఏపీలోనే ఉండటం గమనార్హం. డిజిటల్ లావాదేవీల్లోనూ ఆంధ్రప్రదేశ్ మహిళా పొదుపు సంఘాలు ముందు వరుసలో నిలిచాయి.
పొదుపు సంఘాల సభ్యులు సాధికారతతో లక్షాధికారులుగా అవతరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. ఇటీవల వారి ఆదాయాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యుల క్రెడిట్ ఆదాయాలపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పొదుపు మహిళలను ప్రోత్సహిస్తూ అమలు చేసిన ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాలు, బ్యాంకు రుణాలతో తోడ్పాటు, మల్టీ నేషనల్ కంపెనీలతో అనుసంధానం లాంటివి సత్ఫలితాలనిచ్చినట్లు స్పష్టమవుతోంది.
తద్వారా ఎన్‌పీఏల రేటు గణనీయంగా తగ్గిపోయి రికవరీ బాగుండటంతో పెద్ద ఎత్తున రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. సకాలంలో చెల్లింపులు కారణంగా వారి రుణ పరపతి సైతం పెరిగింది. గత సర్కారు హయాంలో ఏపీలో పొదుపు సంఘాల ఎన్‌పీఏలు ఏకంగా 18.36 శాతం ఉండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా ఆదుకుని జీవం పోయడంతో ఇప్పుడు ఎన్‌పీఏలు గణనీయంగా 0.17 శాతానికి తగ్గిపోయాయి.
♦ ఆంధ్రప్రదేశ్ తరువాత అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన మహిళా పొదుపు సంఘాల సభ్యుల్లో తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. మరో ఏడాదిలోగా హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జార్ఖండ్ పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది.
♦ వచ్చే రెండేళ్లలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మహిళా పొదుపు సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటనుంది.
♦ 2027 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేం‘ద్ర పాలిత ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులై గేమ్ ఛేంజర్‌గా నిలుస్తారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు లక్షాధికారులుగా అవతరించడమే కాకుండా వారి కార్యకలాపాలను విస్తృతం చేస్తూ సంపదను సృష్టించి పునఃపంపిణీ చేస్తున్నారు.
♦ గ్రామీణ ప్రాంతాల్లోని 72.7 శాతం మహిళా పొదుపు సంఘాల లావాదేవీలు ఇప్పుడు మెట్రో ప్రాంతాలకు, బయట జిల్లాలకు విస్తరించాయి. 20 కి.మీ. నుంచి 2,000 కి.మీ. పరిధిలో రాష్ట్రం లోపల, బయట కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా 65 శాతం మంది ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 30.5 శాతం గ్రామీణ ఏటీఎం లావాదేవీలు పట్టణాలు, మెట్రో ప్రాంతాలు, ఆయా జిల్లాల వెలుపల జరుగుతున్నాయి.
♦ పొదుపు సంఘాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యులు వారి సొంత జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి వ్యయం చేయడం పెరిగిన వారి కొనుగోలు శక్తిని సూచిస్తోంది.
♦ విజయనగరం జిల్లాకు చెందిన పొదుపు సంఘాల సభ్యులు 68 కి.మీ. ప్రయాణించి విశాఖలో వ్యయం చేయగా శ్రీకాకుళం జిల్లా సంఘాల సభ్యులు 1,115 కి.మీ. ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో వ్యయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 1,647 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో వ్యయం చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళా సభ్యులు 2,074 కి.మీ.ప్రయాణించి ఢిల్లీలో వ్యయం చేశారని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. వ్యాపారాల నిమిత్తం వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించి ఉంటారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment