స్కూల్‌లో విచారణ చేస్తున్న ఎంఈఓ తిరుపాల్
సాక్షి, నెల్లూరు: అభం, శుభం తెలియని చిన్నారి విద్యార్థినిపై ఆ పాఠశాల పీఆర్వో లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన బ్రహ్మయ్య పొదలకూరురోడ్డు డైకస్‌రోడ్డు విజయలక్ష్మీనగర్‌లోని ఓవెల్ 14 స్కూల్‌లో పీఆర్వోగా పనిచేస్తున్నాడు.
ఆయన అదే పాఠశాలలో నాల్గోతరగతి చదువుతున్న బాలికతో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించసాగాడు. కొద్ది రోజులుగా బాలిక స్కూల్‌కు వెళ్లేందుకు భయపడుతోంది. పీఆర్వో వైఖరిపై పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో శనివారం పాఠశాలకు వెళ్లిన బాలిక అనారోగ్యంగా ఉందంటూ కొద్ది సేపటికే ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.
బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు అసలేం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పీఆర్వో ఏదో ఒక సాకుతో ల్యాబ్‌లోకి తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని పీఆర్వో వైఖరిపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు.
చదవండి: (మోసపోయానని భావించి.. డెత్‌నోట్‌రాసి ప్రైవేట్ లెక్చరర్ బలవన్మరణం)
పీఆర్వో వికృత చర్యలపై పాఠశాల ఉపాధ్యాయురాలికి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటంటూ మండి పడ్డారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం పీఆర్వోను వెనకేసుకు రావడంతో వారు ఆగ్రహానికి గురై పాఠశాల కిటికీ అద్దాలు పగులగొట్టారు. అక్కడే ఉన్న బ్రహ్మయ్యను చితకబాదారు. ఈ విషయమై స్థానికులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె. నరసింహరావు, ఎస్‌ఐ శ్రీహరిబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్ విజయారావు ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, ఇన్‌స్పెక్టర్ నరసింహరావు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. సీసీపుటేజ్‌లను సేకరించారు. ఇదిలా ఉంటే బ్రహ్మయ్యపై గతంలో పలు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అతనిపై పాఠశాల యాజమన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఎంఈఓ విచారణ
ఈ విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేకెత్తించడంతో డీఈఓ విచారణకు ఆదేశించారు. ఎంఈఓ తిరుపాల్ స్కూల్‌లో విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను విచారించారు. ఈ విషయమై ఎంఈఓను సంప్రదించగా డిప్యూటీ డీఈఓ, తాను విచారణ నిర్వహిస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం నివేదికను డీఈఓకు అందజేస్తామని తెలిపారు.
ఓవెల్ 14 స్కూల్ గుర్తింపు రద్దు
బాలికపై పీఆర్వో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడం, ఓవెల్ 14 స్కూల్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌చార్జి డీఈఓ సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులను వారికిష్టమైన పాఠశాలలో చేర్చేందుకు విద్యాశాఖ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment