సాక్షి, అమరావతి: తాను గవర్నర్‌తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ లీక్ అయ్యాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఆయన ముఖ్య కార్యదర్శి విచారణ జరపడంలో విఫలమయ్యారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని కోరారు. లీకేజీపై 72 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించేలా సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, మంత్రులు.. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గుంటూరు వాసి మెట్టు రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ముందు విచారణకు వచ్చింది. నిమ్మగడ్డ తనకు బాగా తెలిసిన వ్యక్తి అని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించనని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావుకు జస్టిస్ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీన్ని మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
రహస్య లేఖల ద్వారా గవర్నర్‌ను సంప్రదించాను: నిమ్మగడ్డ
‘ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో నేను రహస్య లేఖల ద్వారా గవర్నర్‌ను సంప్రదించాను. రెండు రాజ్యాంగ కార్యనిర్వాహకుల మధ్య సాగిన ఈ లేఖలను ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేదు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాలతో వీటిని ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారు. ఈ నెల 18న అసెంబ్లీ కార్యదర్శి నుంచి నాకు ఓ లేఖ అందింది. నేను రాసిన లేఖల ఆధారంగా మంత్రులు.. బొత్స, పెద్దిరెడ్డిలు నాపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను దూషించారు. ఏపీ పోలీసులకు లేఖల లీకేజీ దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తే వాటిని నేనే లీక్ చేశానని ఇరికిస్తారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సి వచ్చింది’ అని నిమ్మగడ్డ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
గవర్నర్‌కు నేను రాసిన లేఖలు లీకయ్యాయి..
Published Sun, Mar 21 2021 5:45 AM | Last Updated on Sun, Mar 21 2021 5:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment