సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానాన్ని మధ్యప్రదేశ్, మూడో స్థానాన్ని ఉత్తరప్రదేశ్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి 3,86,86,305 మందికి సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఐడీలను జారీ చేసిందని వెల్లడించింది.
ప్రాథమిక దశలోనే వ్యాధుల నివారణ..
జీవనశైలి, జీవనశైలేతర వ్యాధులను నివారించడానికి రాష్ట్రంలోని 4.66 కోట్ల జనాభాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రజలకు వారి ఇళ్ల వద్దే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు.. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి ప్రాథమిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో వ్యాధులు బయటపడినవారికి వైద్యులతో తదుపరి పరీక్షలు చేయిస్తున్నారు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటికి 3,86,86,305 మందికి వారి ఇళ్ల వద్దే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. వారి ఆరోగ్య వివరాలతో కూడిన హెల్త్ ఐడీలను జారీ చేసి డిజిటలైజ్ చేశారు. అలాగే ప్రజల హెల్త్ ఐడీలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానించారు. దీంతో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
చదవండి: మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా
Comments
Please login to add a commentAdd a comment