
సాక్షి, అమరావతి: తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడపాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 8 నుంచి ఈ రైలును ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారమిచ్చింది. ఈ రైలు రూట్, ప్రయాణ సమయాలు, ఆగాల్సిన రైల్వేస్టేషన్లు, చార్జీలపై నివేదికను సమర్పించమని ఆదేశించింది. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్–తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత ఈ రైలును ప్రవేశపెట్టడం గురించి ప్రకటన చేయాలని వారు భావిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. అందులో మొదటగా సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ఇటీవల ప్రవేశపెట్టారు. ఆ రైలుకు ప్రయాణికుల నుంచి అత్యంత ఆదరణ లభిస్తోంది. రోజూ వందశాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వందేభారత్ రైలును సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిపేందుకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది.
Comments
Please login to add a commentAdd a comment