సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విచారించేందుకు సీఐడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా, ఏసీబీ కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది. సమయాభావం, ఇతరత్రా కారణాల వల్ల చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారిస్తామని సీఐడీ.. ఏసీబీ కోర్టుకు తెలిపింది. కోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
23, 24వ తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని సీఐడీకి కోర్టు స్పష్టం చేసింది. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున బ్రేక్ ఇవ్వాలంది. బ్రేక్ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడవచ్చని తెలిపింది. పోలీసు కస్టడీ సమయంలో విచారణ కనిపించేంత దూరంలో చంద్రబాబు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి స్పష్టం చేసింది. పోలీసు కస్టడీలో ఏ విధంగానూ జోక్యం చేసుకోరాదని, సుప్రీంకోర్టు నిర్ధేశించిన విధంగానే సాయం అందించాలని చంద్రబాబు న్యాయవాదిని ఆదేశించింది.
విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలని, ప్రక్రియను మొత్తం రహస్యంగా ఉంచి, సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఇవ్వాలంది. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు అవసరమైన వైద్య, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఐడీని ఆదేశించింది. పోలీసు కస్టడీకి ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలంది. విచారణ సందర్భంగా చంద్రబాబుపై ఎలాంటి థర్డ్ డిగ్రీ పద్దతులు గానీ, కఠిన చర్యలు గానీ చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది.
విచారణ ముగిశాక కోర్టుకు హాజరు పరచాలి
24న విచారణ ముగిసిన తర్వాత చంద్రబాబును సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు పరచాలని ఏసీబీ కోర్టు చెప్పింది. ఇద్దరు మధ్యవర్తులైన అధికారులు, సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌ను.. వారి పేర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది. చంద్రబాబు పోలీసు కస్టడీకి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
కోర్టు సమర్పించిన జాబితాలోని అధికారులను, అలాగే కోర్టుకు సమర్పించిన జాబితాలోని చంద్రబాబు న్యాయవాదుల్లో ఒకరిని అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా కోర్టుకు చంద్రబాబు న్యాయవాదులు సమరి్పంచిన పేర్లలో న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు, మెండా లక్ష్మీనారాయణ, టి.విష్ణు తేజ, డి.రాంబాబు, సువ్వారి శ్రీనివాస్, పారా కిషోర్ ఉన్నారు.
చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు పాత్రపై కీలక ఆధారాలున్నాయని, వాటిని ఆయన ముందుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉందని, అందు కోసం ఆయన్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానంద, హైకోర్టు అదనపు పీపీ ఎస్.దుష్యంత్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్దార్థ అగర్వాల్, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు, చంద్రబాబును పోలీసు కస్టడీకి అప్పగించేందుకు కారణాలు ఉన్నాయా? లేదా? అన్న ప్రశ్నకు కోర్టు తన ఉత్తర్వుల్లో సమాధానం ఇచ్చింది. సీఐడీ తమ ముందుంచిన సాక్ష్యాధారాలను బట్టి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన సాంకేతిక సాయం అందజేసిన కంపెనీలకు చెల్లింపుల తాలుకు నోట్ ఫైళ్లు, ఆయా కంపెనీలతో జరిపిన లావాదేవీలు, చర్చలు తదితరాలకు సంబంధించిన సమాచారం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన నేపథ్యంలో ఆయన్ను పోలీసు కస్టడీకి ఇవ్వడం సముచితమని తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తున్నట్లు న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: బాబుకు భంగపాటు
Comments
Please login to add a commentAdd a comment