
సాక్షి, అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను ధార్మిక సంస్థల చట్ట నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలంటూ దేవదాయ కమిషనర్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ట్రస్టీలు బుద్ధయ్యచౌదరి, రామలింగేశ్వరరావు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దేవదాయ శాఖ కమిషనర్ నోటీసులపై అభ్యంతరాలుంటే వాటిని రెండు వారాల్లో అధికారులకు సమర్పించాలని నరేంద్రకుమార్ తదితరులను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ బుధవారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. తమ ట్రస్ట్ దేవదాయ చట్ట నిబంధనల ప్రకారం ‘ధార్మిక సంస్థ’ నిర్వచనం పరిధిలోకి రాదన్నారు. అందువల్ల ధార్మిక చట్ట నిబంధనల కింద రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ధార్మిక సంస్థల చట్ట నిబంధనల పరిధిలోకి వస్తాయని, ఈ ట్రస్ట్ ప్రజల నుంచి రూ.కోట్ల మేర విరాళాలు సేకరిస్తోందన్నారు. ఆదాయపు పన్ను నుంచి కూడా మినహాయింపు పొందుతోందని, పెద్ద మొత్తం స్థిరచరాస్తులున్నాయని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. బుధవారం తీర్పు వెలువరిస్తూ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలతో ఏకీభవించారు. ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పిటిషన్లను కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment