సాక్షి, అమరావతి బ్యూరో: లారీలకు రథసారథుల కొరత ఏర్పడింది. దాదాపు 15 ఏళ్లుగా డ్రైవర్ల కొరత ఎక్కువవుతోంది. ఇచ్చే జీతం కంటే.. వారికొచ్చే కమీషన్లు, ట్రిప్పుల మామూళ్లు వంటి వాటితో డ్రైవర్ల ఆదాయం మెరుగ్గా ఉండేది. మొదట్లో లారీలపై క్లీనర్లుగా చేరి ఆపై డ్రైవర్లు అయ్యేవారు. భార్యాపిల్లలకు, కుటుంబాలకు వారాల తరబడి దూరంగా ఉండాల్సి వచ్చినా.. ఆదాయం బాగుండటంతో డ్రైవర్ వృత్తి వైపు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఆ వృత్తి చేపట్టేవారు తగ్గిపోయారు.
పాత తరం డ్రైవర్లు వృద్ధాప్యానికి చేరుకోవడం, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అధికంగా సంభవించడం, వారి సంతానం ఈ వృత్తిపై ఆసక్తి చూపకపోవడం, వీరి పిల్లలు చదువుకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు, ఇతర వృత్తులు, వ్యాపారాల వైపు మళ్లడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం వంటివి డ్రైవర్ల కొరతకు కారణమవుతున్నాయి. ఇది లారీ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో సరుకు రవాణా చేసే లారీలు 3 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో 35 శాతం లారీలకు డ్రైవర్ల కొరత ఉందని యజమానులు చెబుతున్నారు.
(చదవండి: గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..)
ఇతర రాష్ట్రాల నుంచి..
లారీ యజమానులు స్వరాష్ట్రంలో డ్రైవర్లు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో అధిక జీతాలిచ్చి మరీ డ్రైవర్లను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి డ్రైవర్లు వస్తున్నారు. వీరికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు (ట్రాలీ డ్రైవర్లకు) చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమయానికి వీరు కూడా అందుబాటులో లేక యజమానులు అవస్థలు పడుతున్నారు. స్థానిక డ్రైవర్లు, వయసు మీరిన కొందరు దూర ప్రాంతాల కంటే లోకల్ లారీల్లో తిరగడానికే ఆసక్తి చూపుతున్నారు.
విజయవాడలో డ్రైవర్ల శిక్షణ కేంద్రం
లారీ డ్రైవర్ల కొరత ఏర్పడుతుందని ముందుగానే ఊహించిన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడకు 32 కిలోమీటర్ల దూరంలోని అంపాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 2005లో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. 20 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు రూ.5.50 కోట్లు వెచ్చించింది. రోజుకు 8 గంటల చొప్పున 32 రోజుల పాటు పూర్తిస్థాయి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బయట డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈ శిక్షణకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తే ఇక్కడ కేవలం రూ.6 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఈ ఇన్‌స్టిట్యూట్ కృష్ణా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లో డ్రైవర్ల కొరతను కొంతవరకు తీరుస్తోంది.
క్లీనర్ల వ్యవస్థకు చెల్లు..
ఒకవైపు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండగా మరోవైపు క్లీనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ప్రతి లారీకి డ్రైవర్‌తో పాటు క్లీనర్ తప్పనిసరి. కానీ క్లీనర్‌గా చేరడానికి మునుపటిలా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఒక్క డ్రైవర్‌తోనే ‘బండి’ లాగిస్తున్నారు.
(చదవండి: సీఎంపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదు)
Comments
Please login to add a commentAdd a comment