మాజీ మంత్రి అప్పలరాజు మండిపాటు
కాశీబుగ్గ: హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఎలా కూల్చివేస్తారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే దుర్దినమని అన్నారు. ఆయన శనివారం పలాసలో విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖపట్నం, అనకాపల్లి, ఇతర వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు నోటీసులు పంపిస్తున్నారని అన్నారు.
‘మీ పార్టీ కార్యాలయాలకు ఒక తీరు. వేరే పార్టీలకు ఒక తీరా? అలాంటి వాటిపై మాట్లాడితే కేసులు పెడతారా’ అని ప్రశ్నించారు. కూల్చివేతలు మొదలైన చోటే పునర్నిర్మాణాలు మొదలవుతాయని, ఎక్కడైతే వినాశనం మొదలవుతుంతో అక్కడే పునఃసృష్టి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి యెల్లో పీనల్ కోడ్ తెచ్చారన్నారు.
10 శాతం ఓట్లతో పార్లమెంట్‌లో ఇందిరాగాంధీకి ప్రతిపక్ష హోదా కల్పించారని, 40 శాతం ఓట్లు ఉన్న తమకు ప్రతిపక్ష హోదా కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీలో గొంతు విప్పడానికి అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒకటో తేదీన పింఛన్లు, జీతాల కోసం అప్పులకు తిరుగుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పరిపాలన విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.5,340 కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
‘జగన్ ఓడిపోయాడు.. చచ్చి పోలేదు’
వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. బూతులు మాట్లాడటంలో అయ్యన్న టాప్ ర్యాంకులో ఉన్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలతో రైతుల వద్దకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వస్తున్నాయని రైతులు సంతృప్తి చెందుతున్నారని, అలాంటి రైతుల గుండెల్లో వైఎస్ జగన్ స్థానాన్ని తీసేయలేరని అన్నారు.
వైఎస్ జగన్ నిర్మించిన ఆర్బీకేల వద్దే టీడీపీ వారు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పీఏసీఎస్‌ల వద్ద రేయింబవళ్లు వేచి ఉండి పోలీసుల సమక్షంలో పంపిణీ చేసేవారని, విత్తనాల కోసం యుద్ధాలే జరిగేవని, రైతులకు ఆ పరిస్థితులు మళ్లీ తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment