భో'జనం' @ ఆన్‌లైన్‌ | Significant growth in online food services in the country | Sakshi
Sakshi News home page

భో'జనం' @ ఆన్‌లైన్‌

Published Mon, Jul 22 2024 2:05 AM | Last Updated on Mon, Jul 22 2024 2:05 AM

Significant growth in online food services in the country

దేశంలో ఆన్‌లైన్‌ ఆహార సేవల్లో గణనీయమైన వృద్ధి

ఇంటి భోజనం కంటే ఆన్‌లైన్‌ ఆర్డర్లకే ఆసక్తి 

2030 నాటికి మార్కెట్‌ విలువ రూ.5.50 లక్షల కోట్ల నుంచి రూ.9 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా 

దేశంలో ఆహార సేవల మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇంటికంటే హోటళ్లు, రెస్టారెంట్లలో తినే వారి సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదవుతోంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలు వచ్చాక వినియోగదారులు తమకు నచి్చన ఆహారాన్ని ఒక్క క్లిక్‌లో ఆర్డర్‌ చేసి హాయిగా లాగించేస్తున్నారు. మార్కెట్‌లో విస్తరిస్తున్న వినియోగదారులు, కొత్తరకాల తినుబండారాల సంఖ్య పెరగడంతో ఈ తరహా వృద్ధి నమోదవుతోందని ఆహార సరఫరాల సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.   –సాక్షి, అమరావతి

రూ.9 లక్షల కోట్లకు వృద్ధి 
ఆదాయంలో పెరుగుదల, డిజిటలైజేషన్, మెరుగైన కస్టమర్‌ సేవలు, కొత్త ధోరణిలో ఆహారపు అలవాట్లు మార్కెట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం రూ.5.50 లక్షల కోట్లుగా ఉన్న ఆహార మార్కెట్‌ విలువ 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల గరిష్ట వృద్ధిని నమోదు చేస్తుందని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 32–34 కోట్ల వినియోగదారుల నుంచి 43–45 కోట్లకు వృద్ధి చెందనున్నారు. 

ఫాస్ట్‌ఫుడ్‌ చైన్‌ల పెరుగుదల, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ప్రవేశంతో దేశంలో ఆహార సేవల మార్కెట్‌లో గత దశాబ్దంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తద్వారా ప్రజలు బయటి నుంచి ఆహార పదార్థాలను ఇంటికే రప్పించుకుని తినే ఫ్రీక్వెన్సీ మరింత పెరగనుంది. వాస్తవానికి దేశంలోని మొత్తం ఆహార సేవల వినియోగంలో దాదాపు 70 శాతం టాప్‌ 50 నగరాల్లోనే ఉంది. ఈ క్రమంలోనే క్లౌడ్‌ కిచెన్‌తో కూడిన క్విక్‌ సరీ్వస్‌ రెస్టారెంట్లు 40 శాతం వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా. 

నెలకు ఏడెనిమిదిసార్లు బయట భోజనమే 
వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఆదాయం పెరుగుదల బయట ఆహారాన్ని తీసుకునే విధానంలో స్పష్టమైన మార్పులు తీసుకొస్తుందని ఓ ప్రముఖ సంస్థ తాజా నివేదిక తేల్చింది. అంటే భారతీయ వినియోగదారులు నెలకు 5 సార్లు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌ డెలివరీల్లో ప్రత్యేక భోజనం చేస్తుంటే ఇది 7–8 రెట్లు పెరుగుతుందని స్పష్టం చేస్తోంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలు, ఫైన్‌డైన్‌ రెస్టారెంట్ల చెయిన్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపింది. 

ప్రతి వినియోగదారుడు సగటున ఆరు కంటే ఎక్కువ సార్లు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు చేస్తే.. ఇందులో ఏడాదిలో మూడు కంటే ఎక్కువ విభిన్న రకాల వంటకాలను ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ భారతీయ వినియోగదారులు ప్రతిసారీ వైవిధ్యమైన ఆహారాన్ని కోరుకుంటున్నట్టు నివేదికలో తేలింది. 

ముంబైలో మొదటి రెండు వంటకాలు దాల్‌ కిచిడీ, మార్గెరిటా పిజ్జా,  ఢిల్లీలో మెక్‌ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్‌పఫ్‌ ఉన్నాయి. బెంగళూరులో మసాలా దోశ, చికెన్‌ బిర్యానీ ఎక్కువగా ఆర్డర్‌ చేయగా.. కోల్‌కతాలో చికెన్, మటన్‌ బిర్యానీలను ఎక్కువగా ఇష్టపడినట్టు ఆ నివేదిక తెలిపింది. 

ఆయా నగరాల్లో ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్న ఆహార పదార్థాలు 
నగరం                     ఆహార పదార్థాలు 
ముంబై                దాల్‌ కిచిడీ, మార్గెరిటా పిజ్జా 
ఢిల్లీ                    మెక్‌ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్‌పఫ్‌ 
బెంగళూరు           మసాలా దోశ, చికెన్‌ బిర్యానీ 
కోల్‌కతా                 చికెన్, మటన్‌ బిర్యానీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement