విశాఖలోని కప్పరాడలో దారుణం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితే మళ్లీ దాపురించింది. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు.. ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విశాఖపట్నంలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.
పాఠశాల విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి మధ్యాహ్న భోజనాలు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను కన్పించింది. రోజూ నిర్దిష్ట మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించింది.
అయితే కూటమి ప్రభుత్వం వ చ్చిన కొద్ది రోజులకే విద్యార్థులకు మళ్లీ ఆరుబయట ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చేసింది. కప్పరాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తరగతి గదుల్లో భోజనాలు చేయడానికి సిబ్బంది అంగీకరించలేదు. ఒకవైపు వర్షం పడి బురదమయంగా మారిన పాఠశాల ఆవరణలో ఆరుబయటే విద్యార్థులను కూర్చోబెట్టేశారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే మధ్యాహ్న భోజనాలు వడ్డించారు.
విద్యార్థులు బతిమాలినా..
బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు బతిమలాడినప్పటికీ అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు ఆరు బయట బురదలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వచ్చింది. దీనిపై కొంత మంది స్థానికులు పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు.
పిల్లలు గదులను పాడు చేసేస్తారని, అందుకే లోపల తినొద్దని చెప్పామని సిబ్బంది చెప్పడం గమనార్హం. బురదలో విద్యార్థులకు భోజనాలు పెట్టడాన్ని స్థానికులు తమ ఫోన్లతో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటి, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నిట్టూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment