నాడు ఒక్క దెబ్బ కూడా తగల్లేదని స్విమ్స్ వైద్య నివేదికల్లో వెల్లడి
మే 14న పులివర్తి నాని నటనతో అనేక మంది ఇక్కట్లపాలు
ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్.. చేతికి కట్లు, కాళ్లకు బ్యాండేజ్‌తో నాడు హడావుడి
జైల్లో మగ్గుతున్న 37 మంది.. పలువురు ఉద్యోగుల సస్పెన్షన్
ఇప్పుడు నిజం నిగ్గు తేలడంతో మండిపడుతున్న జనం
తిరుపతి రూరల్ (తిరుపతి జిల్లా) : చేతులకు కట్లు, కాళ్లకు బ్యాండేజీలు, మూతికి మాస్‌్కతో తాను తీవ్రంగా గాయపడ్డానని పులివర్తి నాని చేసిన హడావుడి అంతా ఒట్టి నాటకమని తేలిపోయింది. నాని తల, శరీరం, చేయి, కాలు.. ఇతరత్రా ఆయన శరీరంలో ఎక్కడా చిన్న దెబ్బ కూడా లేదని తేటతెల్లమైంది. స్విమ్స్ వేదికగా ఆయన సాగించిన హంగామా అంతా ఉత్తుత్తి నటనేనని అదే స్విమ్స్‌లో ఆయనకు తీసిన ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్.. తదితర వైద్య పరీక్షలు స్పష్టం చేస్తున్నాయి. నాని ‘కట్టు’ కథలతో 37 మంది జైలు పాలయ్యారు.
పలువురు ఉద్యోగులు బదిలీకి గురయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. పోలింగ్ అనంతరం మే 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వద్ద గొడవ జరిగింది. టీడీపీ అభ్యర్థి అయిన నాని ఆ తర్వాత రెండు గంటలపాటు వర్సిటీ పరిసరాల్లోనే హుషారుగా తిరిగారు. అనుచరులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా ధర్నాలో నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. అనంతరం గొడవ సద్దుమణిగాక ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో కాసేపు సేద తీరాక ఒక వ్యూహం రూపొందించుకుని హుటాహుటిన స్విమ్స్‌కు బయలుదేరారు.
అక్కడ వాహనం నుంచి దిగగానే.. నడవ లేనట్లు.. శరీరం అంతా నొప్పులున్నట్లు అక్కడి వైద్యులకు చెప్పారు. వారు ఆయన తలకు, శరీరానికి, చేతికి, భుజాలకు, పొట్టకు, కాలికి.. ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలు, సీటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ సైతం చేశారు. ఆ గొడవలో తాను తీవ్రంగా గాయపడినట్టు పబ్లిసిటి ఇచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత నానిపై దాడి జరిగిందని, ఆయనకు ఏమో అయిపోయిందని ఎన్నికల కమిషన్ అనేక మంది పోలీసులు, ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అమాయకులైన 37 మందిపై పోలీసులు కేసులు పెట్టి, జైలుపాలు చేశారు. వారు ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు.
ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు వెల్లడి
పులివర్తి నాని స్విమ్స్‌లో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఇటీవల వెలుగు చూశాయి. నాని తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్.. ఇతరత్రా వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో నాని స్వార్థంతో ఆడిన నాటకం వల్ల ఇబ్బంది పడిన వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్య నివేదికలను ముఖ్యమంత్రికి, హైకోర్టు, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వారు అనవసరంగా నెలల తరబడి జైలులో మగ్గుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సస్పెండ్ అయి జీతాలు రాక, ఎన్నికల కమిషన్ చేసిన సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియక పలువురు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
నాని నాటకం బట్టబయలు
రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారు. గాయం కాని ఘటనలో అమాయకులు 37 మందిపై కేసులు నమోదు చేయించి వేధించారు. దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించాలి. నాని అద్భుత నటనతో ఉద్యోగులు, పోలీసులను బలిపశువులు చేశాడు. 37 మందిని జైలుకు పంపించాడు. ఆ కుటుంబాల శాపం ఆయనకు తగిలి తీరుతుంది. దేవుడు, ప్రకృతి చాలా గొప్పవి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి
Comments
Please login to add a commentAdd a comment