తల్లి కల్పకంతో సీతారాం ఏచూరి
సాక్షి, అమరావతి\ న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం (88) శనివారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. అస్వస్థత, వృద్ధాప్య సమస్యలతో ఆమె మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 1933 జూన్ 6న పాపాయ్యమ్మ, కందా భీమశంకరం దంపతులకు కల్పకం మద్రాసులో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు వేముగంటి బొప్మాయమ్మ, అనేకమంది ఇతర కార్యకర్తలతో కలసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఏర్పాటు చేసిన బాలికాసేనలో సభ్యురాలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ దివ్యాంగుల బాలికల పాఠశాల, బాలభవన్‌లకు కన్వీనర్‌గా సేవలు అందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర మహిళా మండలి అక్షరాస్యత ఉద్యమం, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ, ఆంధ్రా వనితామండలి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేసినందుకు దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరిట ఇచ్చే అవార్డుకు ఎంపికయ్యారు.
కల్పకం బాల్యంలోనే ఏచూరి సర్వేశ్వర సోమయాజులుతో వివాహం జరిగింది. అర్ధంతరంగా ఆగిపోయిన చదువును పెళ్లి తర్వాత కూడా కొనసాగించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ’ఇండియా అండ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్’ అంశంలో ఎంఫిల్ చేశారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఇటలీ, మలేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వివిధ సమావేశాలకు హాజరయ్యారు.
ఆమె చేసిన భరతనాట్య ప్రదర్శనలకు 80కి పైగా పతకాలు గెలుచుకున్నారు. కల్పకం రెండో కుమారుడు భీమశంకర్ ఏచూరి మారుతి ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె సోదరుడు మోహన్ కందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. కల్పకం భౌతికకాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు దానం చేశారు.
ఆమె మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వై.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె.నారాయణ, కె.రామకృష్ణ , ఏపీ, మహారాష్ట్ర సీపీఎం కమిటీలు, కేరళ సీఎం పినరయి విజయన్, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment