గడిచిన ఆరు నెలల్లో 47.78లక్షల మంది సందర్శన
46 శాతం మంది కుటుంబాలతో హాయిగా గడిపేందుకే రాక
18శాతం మంది వ్యాపారం, వైద్య సేవల కోసం పర్యటన
భారతీయ ఇన్‌బౌండ్ పర్యాటకానికి ప్రధాన మార్కెట్‌గా ఆరు దేశాలు
సాక్షి, అమరావతి: స్వదేశంలో ఉన్న వారు విదేశాలకు వెళ్లి సేద తీరాలనుకుంటుంటే... విదేశీయులు మాత్రం భారత్‌వైపే చూస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో 47.78 లక్షలమంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు. దీంతో విదేశీయులకు భారత్ విశ్రాంతి, వినోద కేంద్రంగా మారుతోంది. అమెరికా నుంచి 17.56శాతం, యూకే నుంచి 9.82శాతం, కెనడా 4.5శాతం, ఆ్రస్టేలియా 4.32శాతం మంది వచ్చారు. ఫారిన్ టూరిస్టు ఎరైవల్ (ఎఫ్‌టీఏ) ఒక్క జూన్‌లోనే 7.06లక్షలు ఉండటం విశేషం.
ఇది 2023లో 6.48లక్షలు, 2019లో 7.26లక్షలుగా నమోదైంది. అయితే ఇది 2023 జూన్ ఎఫ్‌టీఏలతో పోలిస్తే 9శాతం వృద్ధిని సాధించగా 2019తో పోలిస్తే 2శాతం క్షీణించింది. భారత్‌కు వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ (46శాతం) మంది సరదాగా కుటుంబాలతో సహా గడిపి వెళ్లారు. ఇక 18శాతం మంది వ్యాపార, వైద్య సేవల కోసం భారత్‌ను సందర్శిస్తున్నారు. వెల్‌నెస్ రిట్రీట్‌లు, అడ్వెంచర్ ట్రిప్‌లకు క్రేజ్ పెరుగుతోంది.
ఢిల్లీ నుంచే దేశంలోకి
విదేశీ పర్యాటకుల టాప్ ప్రవేశ స్థానంగా 31.45శాతంతో ఢిల్లీ నిలుస్తోంది. ఆ తర్వాత ఆర్థిక రాజధాని ముంబై (14.83శాతం), హరిదాస్‌పూర్ (9.39శాతం), చెన్నై (8.35శాతం), బెంగళూరు (6.45శాతం) ఉన్నాయి. అనిశ్చితిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 21.55శాతం మంది భారత్‌కు వచ్చారు. అయితే వీరందరూ పర్యాటకులని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దశాబ్ద కాలంగా హరిదాస్‌పూర్ నుంచే వీరందరూ భారత్‌లోకి వస్తున్నారు.
ఈ క్రమంలో ఫారెక్స్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 17.62శాతం ఎక్కువగా ఉంది. అదే 2023లో ఆసియా పసిఫిక్ దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా 90లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌లోకి వచ్చారు. భారతీయ ఇన్»ౌండ్ పర్యాటక మార్కెట్‌కు ఆ్రస్టేలియా, మలేసియా, సింగపూర్, జపాన్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా ప్రధానంగా నిలుస్తున్నాయి. 2023లో ఈ ఆరు దేశాల నుంచే ఏకంగా 10.22లక్షల మందిపైగా విదేశీయులు వచ్చారు.
1.50 కోట్ల మంది విదేశాలకు
కోవిడ్ మహమ్మారి విజృంభించిన తర్వాత విదేశాల్లో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యలో 1.50 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పర్యటించారు. గతేడాది ఇదే సమయానికి 1.32లక్షల మంది విదేశాలకు వెళ్లారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఎక్కువ మంది విదేశీ యాత్రలు చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో యూకే, సౌదీ, యూఎస్, థాయ్‌లాండ్, సింగపూర్ భారతీయుల అగ్రగామి ఎంపికలుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment