విద్యుత్‌ సేవలన్నీ ‘ఆన్‌’లైన్‌ | Smart meter setup for every home in AP | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సేవలన్నీ ‘ఆన్‌’లైన్‌

Published Wed, May 5 2021 5:03 AM | Last Updated on Wed, May 5 2021 5:03 AM

Smart meter setup for every home in AP - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేయడం మొదలుకుని.. కట్టే బిల్లుల వరకూ అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లోనే జరిపేందుకు అవసరమైన మార్పులు తేవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. కరోనా వంటి కష్టకాలం వచ్చినా ఈ తరహా విధానం శ్రేయస్కరమని పేర్కొంది. దీనివల్ల విద్యుత్‌ వినియోగదారుల హక్కులకు తగిన భద్రత పెరుగుతుందని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలకు గతేడాది పంపించింది. 

కేంద్రం ముసాయిదాలోని అంశాలివీ
► కనెక్షన్‌ కోసం దరఖాస్తు, వాటి మంజూరు, డిస్కమ్‌ పరిధిలో ఉండే కనెక్షన్ల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉండాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని సూచించింది. అవసరమైతే డిస్కమ్‌లు మొబైల్‌ యాప్‌లను అందుబాటులోకి తేవాలి. కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే.. మెట్రో సిటీల్లో 7 రోజుల్లో, మునిసిపాలిటీల్లో 15 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లో కనెక్షన్‌ ఇవ్వాలి.
► వినియోగదారుల ఇళ్లు లేదా వ్యాపార సంస్థలకు స్మార్ట్, ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాలి. ప్రీపెయిడ్‌ సర్వీస్‌ తరహాలో ముందే డబ్బులు చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. స్మార్ట్‌ మీటర్ల వల్ల ఆన్‌లైన్‌ ద్వారానే వినియోగం, సేవలు, నాణ్యత తెలుసుకోవచ్చు.
► మీటర్లను వినియోగదారులే కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఇలాంటి మీటర్లను ఏపీఈఆర్‌సీ గుర్తించిన సంస్థ చేత ఎలాంటి ఫీజు తీసుకోకుండా పరీక్షించాలి. మీటర్‌ రీడింగ్, బిల్లింగ్‌ ప్రక్రియ మొత్తం వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. డిస్కమ్‌లు బిల్‌ వివరాలను వినియోగదారుడికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపాలి. రూ.వెయ్యి దాటిన బిల్లును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే ఏర్పాటు చేయాలి. బిల్లు కట్టలేదని సరఫరా నిలిపివేస్తే, బిల్లు చెల్లించిన వెంటనే పునరుద్ధరించాలి. లేనిపక్షంలో సంబం ధిత డిస్కమ్‌ జరిమానా చెల్లించాలి. 
► తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్‌ మీటర్లు బిగించాలి. ఇప్పటికే ఈ దిశగా డిస్కమ్‌లు అడుగులు వేస్తున్నాయి. క్రమంగా  అన్ని వర్గాల వినియోగదారులకు  విస్తరింపజేయాలి. 

నాణ్యత తప్పనిసరి
► వ్యవసాయ విద్యుత్‌ మినహా.. వినియోగదారులందరికీ 24 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాలి. విద్యుత్‌ అంతరాయాలను విధిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. దీనికోసం సిస్టమ్‌ యావరేజ్‌ ఇంట్రప్షన్‌ డ్యూరేషన్‌ ఇండె క్స్, సిస్టమ్‌ యావరేజ్‌ ఇంట్రప్షన్‌ ఫ్రీక్వెన్సీ 
ఇండెక్స్‌ను అనుసరించాలి. 
► వినియోగదారుల ఫిర్యాదులు, పరిష్కారం కూడా పారదర్శకంగా ఉండాలి. నాణ్యమైన సేవలు అందించని పక్షంలో డిస్కమ్‌లు వినియోగదారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా అమలయ్యేందుకు వీలుగా ఫిర్యాదుల విభాగాన్ని బలోపేతం చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement