సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) విజయవాడ, విశాఖపట్నం, కడప జోన్లలో విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం), స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఈఈడీసీ) సహకారంతో విజయవాడ జోన్‌లో 70 అదనపు హైటెన్షన్ (ఈహెచ్‌టీ) సబ్‌స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి.
ఈ సబ్‌స్టేషన్లలో మొత్తం 9 వాట్లవి 1,100 ఎల్‌ఈడీ బల్బులు, 20 వాట్లవి 3,026 ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, 35 వాట్లవి 884 బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్‌డీసీ) సీలింగ్ ఫ్యాన్లు, 70 వాట్లవి 263 ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్లు, 110 వాట్లవి 2,441 ఎల్‌ఈడీ యార్డ్ లైట్లు, 190 వాట్లవి 342 యార్డ్ ఫ్లడ్‌లైట్లను అమర్చారు. పాత, సంప్రదాయ లైట్ల స్థానంలో వీటి ఏర్పాటు ద్వారా ఏటా రూ.1.87 కోట్లు విలువైన 2.58 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా కానుంది. వీటికి అయిన ఖర్చు రూ.1.52 కోట్లు పదినెలల్లో తిరిగిరానుంది.
విశాఖపట్నం జోన్‌లో 69, కడప జోన్‌లో 102 సబ్‌స్టేషన్లలో కూడా ఈ పనులు చేపట్టనున్నారు. దీంతోపాటు నష్టాలను తగ్గించడానికి కొత్త హైటెన్షన్ (హెచ్‌టీ) లైన్లను ఏర్పాటు చేయడం, పాతలైన్లను మార్చడం, ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పెంచడం, పాతవాటికి సామర్థ్యాన్ని జోడించడం, కెపాసిటర్ బ్యాంక్, రియాక్టర్లను ఇన్‌స్టాల్ చేయడం వంటి రియాక్టివ్ పవర్ మేనేజ్‌మెంట్ చర్యలను కూడా ట్రాన్స్‌కో చేపడుతోంది.
ఖర్చులు తగ్గుతాయి
నియంత్రణ లేకుండా సమానమైన లైటింగ్ పిక్చర్‌తో పోలిస్తే 80 శాతం కంటే ఎక్కువ విద్యుత్‌ను ఆదాచేసే లైటింగ్ అప్‌గ్రేడ్‌లు, స్మార్ట్ నియంత్రణలపై ట్రాన్స్‌కో దృష్టిసారించింది. అందులో భాగంగానే విద్యుత్ ఆదాచేసే ఎల్‌ఈడీ బల్బులు, ఫ్యాన్లు అమర్చుతున్నాం. – కె.విజయానంద్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో
Comments
Please login to add a commentAdd a comment