సాక్షి, చిత్తూరు: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అన్నింటిలోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. సామాజిక సాధికారత సాధించిన తరువాతే ప్రజల వద్దకు బస్సు యాత్ర ద్వారా వస్తు న్నామన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరంలో అశేష జనం మధ్య జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు మేలు చేశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
1931 తర్వాత బీసీ కులగణన జరగలేదని, మళ్లీ ఇప్పుడే సీఎం జగన్ దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీసీ కులగణనకు పచ్చ జెండా ఊపారని కొనియాడారు. టీడీపీ పాలనలో సామాజిక న్యాయం ఎండమావిగా ఉండేదన్నారు. పైగా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను చంద్రబాబు సహా టీడీపీ నేతలు చులకన చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలనూ వైఎస్సార్‌సీపీ గెలవడం తథ్యమని చెప్పారు.
మైనారిటీలను మోసం చేసిన టీడీపీ: అంజాద్ బాషా
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మైనారిటీలకు తీరని మోసం చేశారని విమర్శించారు. సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని బాధ్యతగా భావించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని, ఇందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎంను చేశారని, ఇది చరిత్రలో నిలిచిపోయే విషయమన్నారు.
ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకొచ్చి, మొక్కుబడిగా ఓ మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. అందుకు భిన్నంగా సీఎం జగన్ మొదటి కేబినెట్లోనే మైనారిటీ సామాజికవర్గానికి అవకాశం కల్పించారని తెలిపారు. మైనారిటీ మహిళను శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేశారన్నారు. టీడీపీ పాలనలో మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ.2,665 కోట్లే ఖర్చు చేశారని, సీఎం జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.23,176 కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. బీసీ పార్టీగా డప్పు వాయించుకునే టీడీపీ బీసీలను దగా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీసీలను వాడుకొని, తరువాత తీసి పడేసేదని అన్నారు. వైఎస్ జగన్ రాకతో బీసీలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితోపాటు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
బడుగుల అభివృద్ధికి సీఎం జగన్ నిరంతర కృషి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగనన్న నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాజకీయ సమానత్వం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులను రెచ్చిగొట్టి చంద్రబాబు విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వారిని కనీసం పరామర్శించలేదని చెప్పారు. పైగా, చిత్తూరు జిల్లా ఎస్పీ, పోలీసుల అంతు చూస్తామని నారా లోకేశ్ అనడం దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment