రాజారత్నం మృతదేహాన్ని అంత్యక్రియలను తరలిస్తున్న నాగప్రసాద్, బంధువులు
సాక్షి, కోనేరుసెంటర్ (కృష్ణా): నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకునేందుకు నిరాకరించాడు ఓ కన్నకొడుకు. చేసేది క్షమించరాని తప్పిదమని తెలిసినా ఆమె తనకు అన్యాయం చేసిందనే అక్కసుతో ఆమె మృతదేహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు. పైగా తన తల్లిని తోబుట్టువు చంపేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తతంగమంతా గతంలోనే తెలిసి ఉన్న పోలీసు అధికారులు అతని దుర్మార్గ పు చర్యను మందలించి తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిగేలా చేశారు. ఈ ఘటన జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... ఈడేపల్లిలో నివాసం ఉంటున్న నాగప్రసాద్ జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తల్లి రాజారత్నంకు నాగప్రసాద్‌తో పాటు కుమార్తె ఉంది. కొంతకాలంగా నాగప్రసాద్‌కు తోబుట్టువుకు మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఈ విషయంలో తోబుట్టువుతో పాటు తల్లితోనూ విభేధాలు ఏర్పడ్డాయి. నాగప్రసాద్ రాజారత్నంను పట్టించుకోవటం మానేశాడు. ఈ విషయంపై రాజారత్నం అనేక మార్లు నాగప్రసాద్‌పై జిల్లా కలెక్టర్‌తోపాటు అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేసింది. అయినా ప్రయోజనం లేకపోవటంతో బంటుమిల్లిలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె వద్దకు వెళ్లి తలదాచుకుంది. అప్పటి నుంచి కూతురు వద్దనే ఉంటున్న రాజారత్నం ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి చనిపోయింది. దీంతో నాగప్రసాద్ తోబుట్టువు ఆమె భర్త కలిసి రాజారత్నం మృతదేహాన్ని ఈడేపల్లిలోని నాగప్రసాద్ ఇంటికి తీసుకు వచ్చారు. నాగప్రసాద్ మృతదేహాన్ని తన ఇంటి ముందు పెట్ట వద్దంటూ వారితో వివాదానికి దిగాడు.
తన తల్లిని అంతమొందించి ఆమె ఒంటిపై ఉన్న నగలు అపహరించారంటూ తోబుట్టువుపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై గతంలోనే అవగాహన ఉన్న స్టేషన్ అధికారులు నాగప్రసాద్‌కు సర్ది జెప్పి అంత్యక్రియలు జరిపించారు. కొడుకు అంత్యక్రియలు నిర్వహించనని తల్లి శవాన్ని ఇంటి ముందు వదలి ఇంటికి తాళాలు పెట్టుకుని వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు నాగప్రసాద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. (చదవండి: లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి)
Comments
Please login to add a commentAdd a comment