
మెడికల్‌షాపులను తనిఖీ చేస్తున్న అర్బన్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు
కడప అర్బన్ : శానిటైజర్ తాగి ఎవరూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హితవు పలికారు. మంగళవారం జిల్లా ఎస్పీ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్రసార మాధ్యమాల్లో పలువురు శానిటైజర్లు సేవించి మరణించారని వార్తలు రావడం బాధాకరమన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైందని, జిల్లాలోని రెండు లైసెన్స్‌డ్ శానిటైజర్ తయారీ దారులపై పోలీసు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వారితో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాన్నారు. జిల్లాలోని డిస్టిలరీలు, స్పిరిట్ తయారీ, నిల్వ, సరఫరాలపై పోలీసు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) వారితో సంయుక్తంగా తనిఖీలు చేస్తోందన్నారు.
శానిటైజర్లు విక్రయించేందుకు ఎలాంటి లైసెన్స్‌ల అవసరం లేకపోయినప్పటికీ శానిటైజర్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరికి అమ్ముతున్నారు? కొనుగోలుకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ తెలిపారు. కర్మాగారంలో నిర్ణీత ప్రమాణాల్లో శానిటైజర్ తయారీ తర్వాత కల్తీ చేయడం, విక్రయించడం, లైసెన్స్‌లేని తయారీ దారునుంచి కొనుగోలు చేయడం, సంబంధిత వాణిజ్య పన్నుల బిల్లులు లేకపోయినా చట్టప్రకారం కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు. వీరికి స10 సంవత్సరాలపాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. విక్రయించేవారు, కొనుగోలు చేసే వారి పేరు, ఫోన్ నెంబరు తప్పనిసరిగా నమోదు చేయాలని, పక్కా బిల్లుల ద్వారా విక్రయించాలన్నారు.
మెడికల్ షాపుల్లో పోలీసుల తనిఖీలు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో మంగళవారం పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో శానిటైజర్లు తాగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. శానిటైజర్లను కొనుగోలు చేసిన బిల్లులు, బ్యాచ్ నెంబర్, వోచర్లను డీఎస్పీ సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ దుకాణదారులకు పలు సూచనలు చేశారు. బ్రాండెడ్ శానిటైజర్లను మాత్రమే విక్రయించాలన్నారు. రిటైర్ దుకాణాల్లో శానిటైజర్లు కొనుగోలు చేసిన వారి పేర్లు, మొబైల్ నంబర్లను నమోదు చేయాలన్నారు. తనిఖీల్లో ఎస్‌ఈబీ సీఐ సీతారామిరెడ్డి, వన్‌టౌన్ సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలను పాటించాలి
బద్వేలు అర్బన్ : శానిటైజర్ విక్రయాల్లో మెడికల్‌షాపుల యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అర్బన్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం పుట్‌పెట్రోలింగ్‌లో భాగంగా పట్టణంలోని మెడికల్ షాపులను పరిశీలించి సంబంధిత యజమానులకు సూచనలు ఇచ్చారు. మెడికల్‌షాపుల యజమానులు శానిటైజర్ కొనుగోలుకు వచ్చే వారి పరిస్థితిని గమనించి నిజంగా కోవిడ్ సంరక్షణ కోసం వినియోగిస్తున్నాడా లేక మత్తుకోసం సేవించేందుకు వినియోగిస్తున్నాడా అని గమనించాలన్నారు. శానిటైజర్ కొనుగోలుకు వచ్చే వారి పూర్తి వివరాలను ఆధార్‌కార్డుతో సహా నమోదు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో శానిటైజర్‌ను కొనుగోలు చేసే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. అలాగే దుకాణ యజమానులు కూడా అధిక మొత్తంలో శానిటైజర్లను విక్రయించరాదని హెచ్చరించారు.
పెనగలూరులో..
పెనగలూరు: మండలంలో శానిటైజర్స్ అమ్ముతున్న దుకాణాలపై మంగళవారం ఎస్‌ఐ చెన్నకేశవ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మందులషాపులు, ఇతర దుకాణాల్లో శానిటైజర్స్ అమ్ముతున్న వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. శానిటైజర్స్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్ బిల్లులను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. శానిటైజర్స్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, వాటి ధరలు ఎంతో ఖచ్చితంగా బిల్లులు చూపాలన్నారు. శానిటైజర్స్ ఎవరికి అమ్ముతున్నామో వారి సెల్‌నెంబర్‌తో సహా షాపుల నందు నమోదు చేసుకొని ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment