మండల స్థాయిలోనూ ‘స్పందన’ | Spandana From mandal level Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మండల స్థాయిలోనూ ‘స్పందన’

Published Sun, Feb 26 2023 5:09 AM | Last Updated on Sun, Feb 26 2023 9:59 AM

Spandana From mandal level Andhra Pradesh - Sakshi

సాక్షి, అమలాపురం: కొత్త జిల్లాలు ఏర్పడిన తరు­వాత స్పందన కార్యక్రమం అనగానే అర్జీదారులు కలెక్టరేట్‌ వద్దనే బారులు తీరుతున్నారు. చిన్నచిన్న సమస్యలకు సైతం వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం గ్రా­మాలు, పట్టణాల్లోని సచివాలయాల్లో రోజూ క్రమం తప్పకుండా స్పందన నిర్వహించాలని గతంలోనే నిర్ణయించింది.

అయినప్పటికీ ఇంకా చాలా మంది కలెక్టరేట్‌కు వస్తున్నారు. దీంతో మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని, దీనిని ఈ సోమవారం నుంచి పక్కాగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

ఎంపీడీఓ కార్యాలయాల్లో..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రీవెన్స్‌ సెల్‌ పేరుతో గతంలో మండల, డివిజన్‌ స్థాయిల్లో అర్జీలు స్వీకరించేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తరువాత స్పందన నిర్వహణ మండల స్థాయిలో నిలిచిపోయింది. కలెక్టరేట్‌ దగ్గర కావడంతో అర్జీదారులు జిల్లా కేంద్రానికే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అమలాపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందనకు తొలి రోజుల్లో 225 నుంచి 250 వరకూ అర్జీలు వచ్చేవి.

శివారు ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, ఇళ్ల ముందు డ్రెయిన్లలో పూడిక తీయడం లేదని, రహదారులు నిర్మించాలనే చిన్నచిన్న సమస్యలు సైతం కలెక్టరేట్‌కు వస్తున్నాయి. వీటి కోసం ఆయా అర్జీదారులు రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల నుంచి ఇక్కడకు వస్తున్నారు.

ఇదిలా ఉండగా గ్రామ/వార్డు సచివాలయాల్లో క్రమం తప్పకుండా ప్రతి రోజూ ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహిస్తోంది. దీంతో కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందనకు 150 నుంచి 175 మంది వరకూ వస్తున్నారు.

ఇలా వస్తున్న అర్జీల్లో కూడా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీసు, ఇతర శాఖలు పరిష్కరించే సమస్యలే అధికంగా ఉంటున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి జిల్లాలోని 22 ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ప్రారంభం కానుంది.

రెవెన్యూ, న్యాయపరమైన వివాదాలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, రోడ్లు, ఇతర చిన్నచిన్న సమస్యలకు వివిధ శాఖల అధికారులు స్థానికంగానే అందుబాటులో ఉండనున్నారు. దీంతో అర్జీదారులకు సైతం కలెక్టరేట్‌కు వచ్చే వ్యయప్రయాసలు తగ్గనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement